ప్రపంచకప్‌ని ముద్దాడాలని, ఆ అద్భుతమైన ఘడియల్ని కళ్లారా చూడాలని ఎవరి ఉండదు చెప్పండి? విశ్వవిజేతగా నిలిచే అవకాశం ఎప్పుడోగానీ రాదు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ముందు ఉంది. రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకొన్న భారత్… ఓసారి టీ 20 విజేతగానూ నిలిచింది. ఈరోజు సౌతాఫ్రికాను మట్టికరిపిస్తే మరోసారి సగర్వంగా టీ 20 ప్రపంచకప్‌ని ఎంచక్కా ఇంటికి తీసుకురావొచ్చు.
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు జరిగే అంతిమ పోరుకు బ్రిడ్జ్ టౌన్ వేదిక కానుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది. అన్ని రకాలుగానూ ప్రత్యర్థిపై మన జట్టుదే పైచేయి. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయలేదు. బౌలర్లు, బ్యాటర్లూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ని తుక్కు తుక్కుగా ఓడించడం మరింత విశ్వాసాన్ని పెంచింది. ఫైనల్లోనూ భారత్ ఇదే జోరు చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మన జట్టులోనూ కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా కోహ్లీ ఫామ్ కలవరపరుస్తోంది. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన కోహ్లీ… వరల్డ్ కప్‌లో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. లీగ్ దశలో ఒక్కటంటే ఒక్క ఎన్నదగిన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సెమీస్‌లో కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దుబే కూడా అనుకొన్న స్థాయిలో ఆడడం లేదు. జడేజా కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సివుంది.
మరోవైపు సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందులోనూ అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. పదునైన బౌలర్లు ఉన్నారు. ఫీల్డింగ్ లో.. సౌతాఫ్రికా ఎప్పటికైనా మేటి జట్టే. ప్రపంచంలోని ఎంత పెద్ద జట్టునైనా సౌతాఫ్రికా ఓడించగలదు. పైగా.. ఈ సిరీస్‌లో వాళ్లు కూడా ఇప్పటి వరకూ ఓడిపోలేదు. కాబట్టి ఇండియా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. కాకపోతే… వరల్డ్ కప్ అనగానే సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడుతుంటుంది. కీలకమైన సమయాల్లో అనూహ్యంగా ఓటమి కొని తెచ్చుకోవడం సౌతాఫ్రికాకు అలవాటు. అందుకే ఇప్పటి వరకూ ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. ఈసారి మాత్రం వరల్డ్ కప్ అందరి ద్రాక్ష కాకూడదని సౌతాఫ్రికన్లు పట్టుదలతో ఉన్నారు. డికాక్, హెడ్రిక్స్, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్.. వీళ్లందరూ ఐపీఎల్ లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన వాళ్లే. భారత బౌలర్ల బలబలాల గురించి వాళ్లకు బాగా తెలుసు. కాబట్టి.. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిజర్వ్ డే ఉండడం కాస్త సానుకూలాంశం.