భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు రొజుకొకరు చొప్పున కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఆకర్షించడంపై భారత రాష్ట్ర సమితి విరుచుకుపడుతోంది. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పెద్దగా విజయవంతం కాలేకపోతోంది. ప్రజలెవరూ స్పందించడం లేదు. ఎందుకంటే మీరు చేసిందేగా అన్న భావన వస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని అవసరం లేకపోయినా చేర్చుకున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసి తమ నెత్తి మీద తాము చేయిపెట్టుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏ పార్టీని వదిలి పెట్టలేదు. టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల తరపున గెలిచిన వారందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. అందుకే అధికార దండం ప్రయోగించారు. రెండు సార్లు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేసుకున్నారు. 2018లో రెండో సారి గెలిచినప్పుడు ఎమ్మెల్యేల అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టలేదు. ఇప్పుడు దాన్నే కాంగ్రెస్ చూపిస్తోంది.
గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీల్ని విలీనం చేసుకుందని పదే పదే గుర్తు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజల్లో తమపై వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని కూడా ఆరోపిస్తున్నారు. తాము చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇవి తెలంగాణ సమాజంలోకి బలంగా వెళ్తున్నాయి. చేరికలు..ఫిరాయింపులు అసలు మొదటి బెట్టిందే బీఆర్ఎస్ అన్న భావనకు వస్తున్నారు. అందుకే బీఆర్ఎస్కు సంపతీ కూడా రావడం లేదు.