ఇప్పటికే అధికారిక వర్గాల్లో ప్రక్షాళన మొదలుపెట్టిన ఏపీ సర్కార్.. మద్యం దుకాణాల్లోనూ సిబ్బందిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు మంత్రులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో గతంలో వైసీపీకి అనుకూలంగా పని చేసే వారిని నియమించుకోవడంతో వారిని తొలగించాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు వారంతా ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీకి ఇబ్బందులు ఎదురయ్యేలా వ్యవహరించారు. దీంతో వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక నూతన మద్యం విధానం అవలంభించింది. 3,200 మద్యం దుకాణాల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన 12వేల మందిని నియమించుకొని వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఇంటర్ చదివిన వాళ్లను సేల్స్ మెన్స్ గా, డిగ్రీ, పీజీ చదివిన వారిని సూపర్ వైజర్లుగా నియమించారు.వారంతా వైసీపీ అనుకూలురే అన్నది ఓపెన్ సీక్రెట్. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చెప్పిన వాళ్లకు మద్యం సరఫరా చేయడం, టీడీపీ నేతలకు మద్యం కేసులు ఇవ్వకుండా వ్యవహరించారు.
అయితే, కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో టీడీపీ మద్యం విషయంలో టెండర్ విధానం తీసుకొస్తుందని భావించారు. అదే జరిగితే తాము ఉన్నపళంగా రోడ్డున పడుతామని ఆందోళన చెందారు. కానీ, టెండర్ విధానం కన్నా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే ఆదాయం వస్తుందని .. దాంతో ప్రస్తుతం మద్యం దుకాణాల్లో వైసీపీ అనుకూలంగా వ్యవహరించిన సిబ్బందిని తొలగించి కొత్తవారిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.