జగిత్యాల కాంగ్రెస్ జగడం ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాస్త మెత్తబడినా… ఇద్దరు నేతలు కలిసి పని చేసే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో సంజయ్ కుమార్ – జీవన్ రెడ్డి అనుచరులు పోటాపోటీగా రంగంలోకి దిగుతుండటంతో జగిత్యాల జగడం కాక రేపుతోంది.
అధిష్టానం కబురుతో ఢిల్లీ పర్యటన, జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా సంజయ్ కుమార్ ను చేర్చుకోవడం పొరపాటు అని , ఇక నుంచి ఇలాంటి వాటికి తావు లేకుండా చూసుకుంటామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఫైర్ మీదున్న జీవన్ రెడ్డి మెత్తబడ్డారు. పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన వెనక్కి తగ్గారు. ఢిల్లీ స్థాయిలో రాజకీయం ఇలా ఉంటే జగిత్యాల కాంగ్రెస్ లో మాత్రం మరో లొల్లి కనిపిస్తోంది.
సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి పేరు లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జీవన్ రెడ్డి అనుచరులు పోటీగా… జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అంటూ కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
జీవన్ రెడ్డి బుజ్జగింపు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయని .. నేతలు రిలాక్స్ అవుతోన్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం రాష్ట్ర నాయకత్వానికి మరింత తలనొప్పిగా మారుతోంది. సంజయ్ కుమార్ – జీవన్ రెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చితే తప్ప ఈ లొల్లికి తెరపడే అవకాశం లేదని అంటున్నారు.