పులివెందులలో జగన్ రెడ్డికి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణంలో పెద్ద ఎత్తున పనులు చేయించి వాటికి బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పులివెందుల పర్యటనకు వెళ్లిన జగన్ రెడ్డిని, ఆయన సతీమణి భారతిరెడ్డిని కూడా కౌన్సిలర్లు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. బిల్లులు ఇప్పించకపోతే అప్పుల పాలైపోతామని ఆస్తులు అమ్మినా తీరవని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే వారికి జగన్ కానీ.. భారతి కానీ భరోసా ఇవ్వలేదు. కోర్టుకైనా వెళ్లిపోరాడదామని చెప్పి వెళ్లిపోయారు. కోర్టుకు వెళ్తే ఇక బిల్లులు రావన్న ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారంతా టీడీపీకి టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలియడంతో అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. శనివారం పులివెందులలో కౌన్సిలర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. వారందర్నీ ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. బిల్లులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని చెప్పారు. అవినాష్ రెడ్డి కూడా తాము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పలేదు.
దీంతో పులివెందుల కౌన్సిలర్లు ఇబ్బంది పడుతున్నారు. వారికి రెండు వందల కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు అంత పెద్ద మొత్తంలో పెండింగ్ పెట్టుకుని వడ్డీలు కట్టుకోలేమని కనీసం భరోసా కూడా ఇవ్వకపోవడంతో పార్టీలో ఎలా ఉండగలమని వారు అంటున్నారు. బిల్లులు ఇప్పిస్తే టీడీపీలోకి వస్తామని బీటెక్ రవికి సమాచారం పంపంతో.. వైసీపీలో హైఅలర్ట్ కనిపిస్తోంది. పులివెందుల కౌన్సిలర్లు టీడీపీలో చేరితే జగన్ పరువు పోతుంది.