టీ 20 వరల్డ్ కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి – రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ని ముద్దాడింది. 2007లో తొలిసారి భారత్ టీ 20 వరల్డ్ కప్ సాధించింది. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరవాత రెండోసారి ఈ కప్ అందుకొంది. వరల్డ్ కప్ అచ్చిరాదన్న సెంటిమెంట్ ని సౌత్ ఆఫ్రికా ఈసారీ కొనసాగిస్తూ, రన్నరప్ తో సరిపెట్టుకొంది.
తొలుత టాస్ గెలిచిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా ఓ దశలో గెలుపు దిశగా పయనించింది. 24 బంతుల్లో 24 పరుగులు కావల్సి ఉండగా.. భారత్ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ దశలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి… బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి ఓవర్‌కు 16 పరుగులు చేయాలి. కానీ తొలి బంతికే హార్దిక్ కీలకమైన మిల్లర్ వికెట్ పడగొట్టాడు. దాంతో భారత్ గెలుపు లాంఛనమైపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ 3, అక్షర్ దీప్ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు మొదలెట్టేశారు. భారత్ ఇప్పటికే రెండుసార్లు వన్డే ప్రపంచకప్ గెలుచుకొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి భారత్ ఒడడిలో ఇది 4వ ప్రపంచకప్. కంగ్రాట్స్ టూ టీమ్ ఇండియా. ఇట్స్ పార్టీ టైమ్.