వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నరకం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఎన్నికల సమయంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఉచ్చు బిగించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కాకినాడ పోర్ట్ ద్వారా అక్రమ బియ్యం రవాణా, డ్రగ్స్ , గంజాయి అంత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ముఖ్యంగా రేషన్ దందాతో ద్వారంపూడి అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజుల కాకినాడ పర్యటనలో, గతంలో జరిగిన అక్రమ బియ్యం రవాణా వ్యవహారంపై ఆరా తీసినట్టు సమాచారం. దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తామని చెప్పిన నాదెండ్ల ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కు సమాచారం చేరవేసినట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురంతోపాటు కాకినాడలో పర్యటిస్తారని అంటున్నారు. రేషన్ మాఫియాకు కేంద్ర బిందువు చంద్రశేఖర్ రెడ్డి అని… సామాన్యులకు అందాల్సిన రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసిన ఆయన ఆట కట్టించేందుకు పవన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.