ఎంచుకొనే వస్తువు, శిల్పం, ఎత్తుగడ, ముగింపు ఇవన్నీ కథకు చాలా ముఖ్యమైన విషయాలు. తెలిసిన కథ ఎత్తుకొన్నా శిల్పం కొత్తగా ఉంటే పాస్ అయిపోతుంది. ఎత్తుగడ, శిల్పం బాగుండే కథ మనగలుగుతుంది. వాటికి ఓ అందమైన ప్రారంభం, ఊహించని ముగింపు ఇస్తే గొప్ప కథలవుతాయి. ఈవారం (జూన్ 30) కూడా కొన్ని కథలొచ్చాయి. వాటిలో ఓ కథ మంచి పాయింట్ పట్టుకొన్నా, శిల్పం ముగింపు విషయంలో తడబడింది. ఆ కథ ఏదో ఈవారం కథల విశ్లేషణలో మీరే చదివి తెలుసుకోండి. అన్నట్టు… ఇది కేవలం ఓ పరిశీలన మాత్రమే! సినిమాలానే కథలు కూడా ఎవరి కోణంలో వాళ్లు చూసి చేసుకోవాల్సిందే, ఆస్వాదించాల్సిందే.
కథ: గృహమే కదా స్వర్గసీమ
రచన: ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి
పత్రిక: ఈనాడు
కుటుంబం, విలువలు, సంప్రదాయాలూ, పద్ధతులూ వీటి గురించిన ప్రస్తావన ఈనాడు కథల్లో తరచూ కనిపిస్తుంటుంది. బహుశా… వాళ్లూ వాటికే పెద్ద పీట వేస్తారనుకొంటా. ఈనాడు ఆదివారం అనుబంధం తిప్పగానే – అలాంటి కథలే తారస పడుతుంటాయి. ఈవారం కథ కూడా అలాంటిదే. అల్లుడు అత్తామామలతో ఎలా ప్రవర్తించాలి? వాళ్లని ప్రేమగా ఎలా చూసుకోవాలి? అని చెప్పే కథ ఇది. పెళ్లయిన కొత్తలో అత్తామామలతో బాగానే ఉన్నా, ఆ తరవాత మిత్రుల చెప్పుడు మాటలు విని, వాళ్లతో దురుసుగా ప్రవర్తిస్తాడు సాకేత్. అతనిలో చివరికి ఎలాంటి ప్రవర్తన వచ్చిందన్నదే కథ. కొత్త తరహా కథలు చదివే వాళ్లకు, కథల్లో కొత్త దారుల్ని, కొత్త పోకడల్ని ఇష్టపడేవాళ్లకూ ఇదో రొటీన్, పాత చింతకాయ పచ్చడి భావాలతో సాగే కథ అనిపిస్తుంది. కాకపోతే.. విలువల గురించీ సంప్రదాయాల గురించీ ఎవరో ఒకరు చెబుతూనే ఉండాలి. మనకు బోర్ కొట్టినా సరే. ఈ పనే ఇలాంటి కథలతో ‘ఈనాడు’ చేస్తోంది.
కథ: సంచార సన్నాయి
రచన: సారిపల్లి నాగరాజు
పత్రిక: సాక్షి
కుల వృత్తి చేసుకొంటూ, ఊరూరా తిరుగుతూ, కడుపు నింపుకొనే సంచారోళ్ల జీవితాల్లోకి కథలు, వ్యధలూ అన్నీ ఇన్నీ కావు. వాళ్లకు స్థిర నివాసం ఉండదు. ప్రభుత్వ పధకాలు అందవు. ఎవరికీ అవసరం లేని, అక్కర్లేని హీనమైన బతుకులు వాళ్లవి. టీవీలు, సెల్ ఫోన్లూ వచ్చాక పురాతన కళలకు చచ్చే చావొచ్చింది. ఇంటింటా తిరిగే గంగిరెద్దోళ్ల పరిస్థితి అందుకు మినహాయింపు కాదు. సాంకేతికత చేతిలో హత్య గావింపబడిన కళల్లో అదొకటి. అలాగని వాళ్లంతా నమ్ముకొన్న వృత్తినీ, అబ్బిన కళనీ వదిలేయాలా? లేదంటే పెరిగిన సాంకేతికతను తిట్టుకోకుండా, వాటినే ఉపయోగించుకొంటూ, తమ కళకు మరింత మెరుగు దిద్దాలా? ‘సంచార సన్నాయి’ కథలో రెండోదే జరిగింది. మార్పుని ఎప్పుడూ స్వాగతించాల్సిందే. అయితే ఆ మార్పుకు అనుగుణంగా జీవితాల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవాలి. ఈ కథ అదే చెప్పింది.
కథ: ఘటన
రచన: తులసీ బాలకృష్ణ
పత్రిక: నమస్తే తెలంగాణ
కరోనా టైమ్‌లో ప్రపంచం బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఎవరి బతుకు ఎట్లా తెల్లారుతుందో తెలీదు. కానీ అప్పటికీ కూడా కొంతమందిలో స్వార్థం పెల్లుబీకింది. అవసరాన్ని ఆసరాగా తీసుకొని, తమ జేబులు నింపుకొన్న స్వార్థపరులు కనిపించారు. అంబులెన్సు డ్రైవర్లు సడన్ గా రేట్లు పెంచేసిన వైనాలు, ఆక్సిజన్ సిలండర్లు ప్రియమైపోయిన ఘటనలూ చాలానే విన్నాం.. చూశాం. ఇది కూడా అలాంటి కథే. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భార్య.. ఇంటికిపోదాం అని భర్తను బతిమాలుకొంటుంది. రాత్రి, పైగా వర్షం. అలాంటి సమయంలోనే అంబులెన్స్ డ్రైవర్ తన ప్రతిభాపాటవాలు ఉపయోగించి, ఊరోళ్ల భయాన్ని క్యాష్ చేసుకొని, రూ.5 వేలు అడగాల్సిన చోట రూ.20 వేలకు బేరం కుదుర్చుకొంటాడు. ఆ ప్రయాణం ఎలా సాగింది? చివరికి ఏమైంది? అనేదే కథ. కర్మ చూస్తూ ఊరుకోదు. తిరిగి ఇచ్చేయడానికి సిద్ధపడుతుంది. క్లైమాక్స్ లో కూడా డ్రైవర్ విషయంలో కర్మ సిద్ధాంతాన్ని ఈ కథతో లింక్ చేస్తూ కథని ముగించిన తీరు బాగుంది. పక్కోడి అవసరాన్ని, అమాయకత్వాన్ని వాడుకోవాలనుకొనేవాళ్లకు ఈ కథ ఓ గుణపాఠం.
కథ: దశ్యం
రచన: శారద
పత్రిక: ఆంధ్రజ్యోతి
సోషల్ మీడియా ప్రభావంతో పేట్నేగిపోతున్న వికృత చేష్టలకు అక్షరరూపం ఈ కథ. ఈ మధ్య ఫొటో షూట్ కల్చర్ ఎక్కువైపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఒకటి మొదలెట్టారు. అది సరదా, పద్ధతిగా ఉన్నంత సేపూ బాగానే ఉంటుంది. పోయి.. పోయి వికృతంగా మారింది. ప్రీ ఫస్ట్ నైట్ షూట్ ఇంకాస్త పైచ్యం జోడించారు. ఇంకెన్ని చూడాలో అనుకొంటున్న దశలో ప్రీ డెలివరీ షూట్ ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా హెచ్చరించారు రచయిత్రి. ఫొటోలు తీసుకొని, సోషల్ మీడియాలో పెట్టేసి, లైకులు, ఫాలోయింగ్‌ల మోజులో పడ్డవారికి ఇదో ‘చురక’ లాంటి కథ. మొదలెట్టిన విధానం బాగున్నా, ముగింపు ఎందుకో చప్పగా అనిపించింది. ఇంకాస్త భిన్నంగా ఆలోచించడానికి స్కోప్ ఉన్న కథ ఇది. ఎందుకో రచయిత్రి ఆ దిశగా ఆలోచించలేదు.
కథ: బంధం
రచన: సింగంపల్లి సాయి శేష కుమార్
పత్రిక: వెలుగు
జీవితం ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటుంది. మనం అనుకొన్నదేదీ జరగదు. కొన్ని ఆనందాలు, ఇంకొన్ని విషాదాలు. అనుకోని ప్రమాదాలూ ఉంటాయి. జీవితం ఒక్కసారిగా కుదేలైన సందర్భాలూ కనిపిస్తాయి. డీలా పడిన జీవితాన్ని సరిదిద్దుకోవడం సరిదిద్దుకోవడం కూడా ఒక కళే. కొన్ని బంధాలు ఎప్పుడు పుడతాయో, మరో కొత్త జీవితానికి ఎలాంటి మలుపులు ఇస్తుందో చెప్పలేం. ఈ బంధం కథలోనూ అదే జరిగింది. రెండు తెగి పడిన జీవితాలకు ఓ పిల్ల సూత్రంలా నిలిచింది. కథ ఎత్తుగడ ఓకే అనిపిస్తుంది. కథనం మామూలుగా అనిపిస్తుంది. శిల్పంలో కాస్త కొత్తదనం జోడిస్తే ఈ కథకు కళ కూడా అబ్బేది.
– అన్వర్