ఏపీ రాజకీయాల్లో కీలకభూమిక పోషించాలని ఉవ్విళ్ళూరుతున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ప్రతిపక్ష నేతగా ఆదరణ పొందేందుకు షర్మిల మార్క్ రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో జగన్ రెడ్డికి ఏమాత్రం స్పేస్ ఇవ్వకుండా తనే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇచ్చేలా షర్మిల రాజకీయం చేయాలనుకుంటుంది అనే వాదనలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అగ్రనేతలు సైతం ఇదే విషయాన్ని షర్మిలకు చెప్పారని దాంతో ఆమె వైసీపీకి పోటీగా కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడిచింది.
దానిని రుజువు చేస్తూ..ప్రత్యేక హోదాపై జగన్ లేవనెత్తాల్సిన వాదనను షర్మిలే వినిపించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలంటూ షర్మిల డిమాండ్ చేయడం వెనక వ్యూహం ఉందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడో తన వైఖరి చెప్పేసింది. అయినా షర్మిల ఈ వాదనను మళ్లీ వినిపించడం వెనక జగన్ ను లాక్ చేయాలన్న రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని 2019లో హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత పెదవి విరిచింది లేదు. దాంతో సహజంగానే ఈ డిమాండ్ ను మళ్ళీ లేవనెత్తడం వలన వైసీపీకి ఆదరణ పెరగకపోగా, కొత్త తలనొప్పి అవుతుందనే జగన్ సైలెంట్ గానే ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. కానీ షర్మిల స్పెషల్ స్టేటస్ డిమాండ్ వెనక జగన్ రెడ్డిని కౌంటర్ చేయడమే కాకుండా ప్రజల్లో ప్రతిపక్ష నేతగా ఆదరణ పొందాలనే వ్యూహం ఉందని అంటున్నారు.