ఫైనల్ గా కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించారా..? కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలను ఎంత బుజ్జగించినా ఫలితం ఉండదనుకుంటున్నారా..? అందుకే ప్లాన్ మార్చి జడ్పీ చైర్మన్ లతో కేసీఆర్ భేటీ అయ్యారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఎమ్మెల్యేలతో వరుసగా కేసీఆర్ భేటీ అయి నచ్చజెప్తున్నా పార్టీ మారాలనే విషయంలో ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదు.పైగా కేసీఆర్ భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారని, రాజకీయాల్లో ఇక కేసీఆర్ పని అయిపోయినట్టేనని అందుకు ఈ చేరికలే తిరుగులేని సాక్ష్యమని కాంగ్రెస్ శ్రేణులు ఉదాహరిస్తున్నాయి. ఈ పరిణామాలతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ మార్చారన్న టాక్ వినిపిస్తోంది.
పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలకు ఎంత బ్రెయిన్ వాష్ చేసిన ఫలితం ఉండటం లేదనే వాస్తవాన్ని కేసీఆర్ గుర్తెరిగారని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలను బుజ్జగించడం వదిలేసి జడ్పీ చైర్మన్ లతో సమావేశం అవుతున్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి స్థానం మీదేనని, రాబోయే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామని జడ్పీ చైర్మన్ లకు కేసీఆర్ భరోసా ఇచ్చారని తెలుస్తోంది.
మరోవైపు, ఎమ్మెల్యేల చేరికల అనంతరం జడ్పీ చైర్మన్ లపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుందనే ముందుచూపుతోనే కేసీఆర్ వారితో భేటీ అవుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే జడ్పీ చైర్మన్ లు పార్టీని వీడుతారనే ఈ భేటీని ఏర్పాటు చేసి ఉంటారని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.