సెంటిమెంట్ , పవిత్రమైన లక్ష్యంతో రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుందనే అమరావతిని రాజధానిగా ఖరారు చేశామన్నారు. దీనిని ప్రతి ఒక్కరు అంగీకరించి తీరాల్సిందేనని అన్నారు. అమరావతి పునర్ నిర్మాణంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి మట్టి, నీరు తెచ్చి అమరావతి ఫౌండేషన్ చోట ఉంచామని గుర్తు చేసిన చంద్రబాబు, దేశంలోని ప్రముఖ ఆలయాలు, మసీదులు, చర్చిల నుంచి పవిత్రమైన మట్టి, నీరు తీసుకువచ్చారన్నారు. ప్రధాని సైతం పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆ పవిత్రతే అమరావతిని కాపాడిందని, వైసీపీ నేతలు మట్టిని తవ్వారు కానీ అమరావతి మట్టిని మాత్రం తాకలేకపోయారని తెలిపారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరమన్నారు. బ్రిటిష్ మ్యూజియంలో అమరావతికి ఓ గ్యాలరీ ఉందన్నారు.
శాస్త్రీయంగా ఆలోచించి అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్న చంద్రబాబు.. దీనికి కులం అవసరమా..? అని ప్రశ్నించారు. భవిష్యత్ ను కాంక్షించే ఎవరూ రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరని స్పష్టం చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది సైతం అమరావతికి ఒకే చెప్పి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. అందరి అభిప్రాయం, నిపుణుల సలహాలతోనే నిర్ణయం తీసుకున్నా ఉద్దేశపూర్వకంగా అమరావతి రాజధానిని వ్యతిరేకించారన్నారు.
హైదరాబాద్ లో సిటీ నిర్మాణం చేసినప్పుడు అన్ని అంశాలను పరిశీలించి నగర అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లామన్నారు చంద్రబాబు. తాను ఉత్తరాది వైపు నుంచి హైదరాబాద్ విస్తరణకు పూనుకుంటే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారన్న ఆయన..అక్కడే డెవలప్ మెంట్ అవుతుందని చెప్పి ముందుకు వెళ్ళినట్లు గుర్తు చేశారు.
ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్ ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. హైటెక్ సిటీని అభివృద్ధి చేయడం కోసం 14రోజులు అమెరికాలో ఉన్నానని, కంపెనీలను తీసుకువచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ కు నీళ్ళు, కరెంట్ సరఫరా లేకపోయినా వాటిని తీసుకొచ్చి హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధిపథంలో నిలిపానని వెల్లడించారు.
హైదరబాద్ తరహాలో రాజధానిగా అమరావతిని నిర్మించాలనే ఆశయంతో ఉన్నట్లు చెప్పారు. ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రాజధానికి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించామని చెప్పారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. తన హయాంలో నేను ఏ పని చేపట్టినా ఎక్కడ చిన్న గొడవలు చోటు చేసుకున్న సంఘటనలు లేవని తెలిపారు చంద్రబాబు. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలన్న జగన్ ..అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారని ఆ తర్వాత ఆయన ఏం చేశారో చూశారు కదా అంటూ విమర్శించారు.