జగన్కు హరిరామజోగయ్య గట్టి దెబ్బేశారు. సీబీఐ కోర్టులో జగన్ కేసులను రోజువారీగా విచారించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. దీనికి కారణం జోగయ్య వేసిన పిటిషన్. ఎన్నికలకు ముందు జగన్ కేసులు ఆలస్యం అవుతున్నాయని రోజువారీగా విచారణ చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రోజువారీ విచారణ జరపాలని ఆదేశించింది.
నిజానికి ఇదే కారణం చెప్పి.. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి తరలించాలని రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరగుతోంది. ఓ సారి విచారణలో ఇంత కాలం కనీసం డిశ్చార్జ్ పిటిషన్లను కూడా పరిష్కరించలేదని తెలుసుకుని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. సుప్రీంకోర్టులో త్వరలో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ లోపే హైకోర్టు రోజువారీ విచారణకు ఆదేశించింది.
జగన్ అక్రమాల కేసుల్లో సీబీఐ, ఈడీ లు ఇరవై చార్జిషీట్లు వేసి పన్నెండేళ్లు దాటిపోయింది. ఇప్పటి వరకూ ఒక్క చార్జిషీటుపైనా ట్రయల్ ప్రారంభం కాలేదు. పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ పోయారు. 130 డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరిగింది. తీర్పు చెప్పాల్సిన రోజున న్యాయమూర్తి సెలవు పెట్టారు. ఆయన సెలవు నుంచి వచ్చేలోపు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి మళ్లీ విచారణ జరుపుతున్నారు. ఇలా కేసుల వ్యవహారం నానుతోంది. ఇప్పుడైనా రోజువారీ విచారణ జరుగుతుందా.. లేకపోతే ఇంకేమైనా న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని జగన్ వాడేసుకుంటారా అన్నది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.