వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వివేకాహత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఊపిరి తిత్తుల వ్యాధి ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు.
వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న. మొదట ఆయనను ఎవరూ పట్టించుకోలేదు కానీ..సీబీఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్మెంట్లో రంగన్న చెప్పారు. ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మరో అనుమానితుు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు.
ఇప్పుడు రంగన్న పరిస్థితి కూడా విషమంగా మారింది. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ నిలిచిపోయింది. సీబీఐ కోర్టులో మాత్రం ప్రతీ వారం విచారణ జరుగుతోంది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.