టీడీపీకి వెళ్లి తమను తాము కాపాడుకోవాలని జగన్ రెడ్డి ఎమ్మెల్సీలకు పరోక్షంగా సలహా ఇచ్చేశారు. తాడేపల్లి వచ్చిన ఆయనను కొంత మంది వైసీపీ నేతలు కలిశారు. వారిలో కొంత మంది తమ జిల్లాల్లో ఎమ్మెల్సీలు టీడీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను ఏం చేయగలనని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బుజ్జగిస్తేనే ఆగలేదని.. ఐదుగురు ఎమ్మెల్సీలు పోయారని ఇప్పుడు అధికారంలో లేకుంటే ఎవరు మాత్రం ఉంటారని ఆయన అభిప్రాయం. పోతే పోయారని … తాను బుజ్జగించనని చెప్పకనే చెప్పేశారు.
మండలిలో వైసీపీకి ఎమ్మెల్సీల మెజారటీ ఉంది. మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతానని ఆయన చెబుతున్నారు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే జగన్ రెడ్డి చేసిన దాని కంటే రెట్టింపు భరించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఒక్కరూ బయటకు రావడం లేదు. మాట్లాడటం లేదు. అత్యధిక మంది చాన్సిస్తే.. టీడీపీలోకి వస్తామని సంకేతాలు పంపుతున్నారు. అయితే వీరెవరికి ఇంకా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
శానసమండలిలో టీడీపీకి ఇప్పుడు మెజార్టీ అవసరమే. అందుకే ఖచ్చితంగా వారిని మోటివేట్ చేసే కార్యక్రమాలు ఉండవచ్చు.. కానీ జగన్ వైపు నుంచి కనీసం ఆపే ప్రయత్నం లేకపోవడం మాత్రం ఆశ్చర్యకరమే. పార్టీ ఉంటే ఉంటుంది లేకపోతే లేదన్నట్లుగా ఆయన తీరు ఉంది. కేసులు.. విచారణలతో తన భవిష్యత్ పై జగన్ నమ్మకం కోల్పోయి.. నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది.