అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైసీపీ ఆఫీసులను కూల్చేస్తారంటూ ఆ పార్టీ దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ..గురువారం తీర్పు వెల్లడించింది. అనుమతులు లేని నిర్మాణాలపై చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పింది. రెండు నెలల్లో పార్టీ కార్యాలయాలకు అనుమతులను అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.
నిజానికి వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేకుండానే కట్టేశారు. కట్టేసిన తర్వాత అనుమతులు ఇవ్వమంటే ఎవరూ ఇవ్వరు. ఎందుకంటే చట్టాల్ని ఉల్లంఘించేశారు కాబట్టి. రెండు నెలలు కాదు ఆరు నెలల తర్వాతైనా అవి అక్రమ కట్టడాలే. అందుకే రెండు నెలల తర్వాతైనా వాటిని కూల్చివేయక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కట్టడాలనే అనుమతులు లేవన్న కారణంగా కూల్చి వేశారు.
వైసీపీ ఆఫీసులపై ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకంటే అవి ప్రభుత్వం నుంచి కారు చౌకగా లీజుకు తీసుకున్నభూముల్లో కట్టారు. అంతకు మించి చట్టాల్ని ఉల్లంఘించకూడదని చెప్పాల్సిన అధికార పార్టీ హోదాలో ఈ నిర్మాణాలను చేపట్టారు. తమదే అధికారం కాబట్టి అడిగేవారు ఉండరన్నట్లుగా వ్యవహరించారు. మరోసారి ఎవరికైనా భయం ఉండాలంటే.. వాటిని కూల్చేయాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.