తెలివిగా అక్రమాలకు పాల్పడడం ఒక కళ.. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డికి అది బాగా అబ్బింది. ప్రజల ద్వారా, ప్రజల సొమ్ముతో సొంత ఇంటిని చక్కదిద్దుకొని.. ఇప్పుడు ఆ ప్రజలనే ఇక్కట్లకు గురి చేస్తున్నాడు పెద్దిరెడ్డి. తన నివాస ప్రాంగణంలో ప్రజల కోసమే రోడ్డు నిర్మాణమని చెప్పుకొని ఇప్పుడు అదే రోడ్డును తన ఆవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటున్నాడు. తన ఇంటికి రోడ్డు నిర్మాణం కోసం ఏకంగా కార్పోరేషన్ సొమ్మునే వాడేశారు. ఇందుకోసం నిబంధనలను సైతం ఉల్లఘించేశారు.
తిరుపతి రాయల్ నగర్ లో మూడెకరాలలో పెద్దిరెడ్డికి నివాసం ఉంది. ఇవి బుగ్గమఠం భూములు అని, వాటిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. బుగ్గమఠం పంచాయితీగా ఉన్నప్పుడు ఆ మార్గం గుండా రాకపోకలు కొనసాగేవి. పంచాయితీ కాస్త కార్పోరేషన్ లో విలీనం అయ్యాక, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ దారిని మూసివేశారు. కేవలం పెద్దిరెడ్డి తన ఇంటికి రాకపోకలు కొనసాగేలా దారికి గేట్లు బిగించేసుకున్నారు.
మొదట పెద్దిరెడ్డి ఇంటి గుండా రాకపోకలు కొనసాగేలా చొరవ తీసుకోవాలని ప్రజలతో దరఖాస్తు ఇప్పించేశారు. ఇంకేముంది.. పెద్దిరెడ్డి కోసం అధికారులు వెంటనే కదిలారు. 19.05 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. సాధారణంగా 10 లక్షలకు మించి ఖర్చు అయ్యే ఏ పని చేయాలన్నా టెండర్ పిలవాలి. కానీ తెలివిగా, దాని రెండు భాగాలుగా విబజించి పనులు చేపట్టి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు పెద్దిరెడ్డి.
ఆ తర్వాత పెద్దిరెడ్డి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నారు. ప్రజల అవసరాలను పక్కనపెట్టి, రోడ్డుకు గేట్లు పెట్టి తన సొంత అవసరాల కోసం రోడ్డుని వినియోగిస్తున్నారు.ఈ విషయమై తాజాగా జనసేన ఆందోళనకు దిగింది. గేట్లు తొలగించాలని లేదంటే బద్దలు కొడుతామని హెచ్చరించింది.