కాంగ్రెస్ లో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదించడం లాంఛనమే. పార్టీ మారినందున తనపై బీఆర్ఎస్ అనర్హతా పిటిషన్ వేస్తుందని ముందుగానే ఊహించి కేకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం మరి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ న్యాయ్ పత్రలో చెప్పిన దాన కోట్ చేస్తూ నేరుగా రాహుల్ గాంధీనే ప్రశ్నించారు.
కేకే రాజీనామా తమను ఇబ్బంది పెడుతుదంని రేవంత్ రెడ్డికి కూడా అర్థమయింది. అందుకే ఆయన సొంత నిర్ణయం కాదని పార్టీ నిర్ణయం తీసుకుందని అందుకే రాజీనామా చేశారని అంటున్నారు. రాజ్యసభలో పార్టీ మారిన వారిపై వెంటనే అనర్హతా వేటు వేయడం వెంకయ్యనాయుడు టైం నుంచి సంప్రదాయంగా వస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఫిర్యాదుచేసిన వెంటనే అనర్హతా వేటు పడుతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం కన్నా.. రాజీనామా ఉత్తమేమేనని అంటున్నారు.
కేటీఆర్, బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు ఎదురుదాడి చేయడమే కాంగ్రెస్ వ్యూహం అనుకోవచ్చు. మీరు చేసిందేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ తాము ఒక్కొక్కరిని కాదని… మూడింట రెండువంతుల మందిని విలీనం చేసుకున్నామని దమ్ముంటే అలా చేసుకోవాలని బీఆర్ఎస్ పరోక్షంగా సవాల్ విసురుతోంది. కానీ అంత మందిని కాంగ్రెస్ ఆకర్షించలేకపోతోంది. ఇప్పుడు కేకే రాజీనామాతో కాంగ్రెస్ కు మరిన్నిసవాళ్లు, విమర్శలు రానున్నాయి.