టీడీపీ ఆంధ్రా పార్టీ అని విమర్శించారు.. తెలంగాణలో ఆ పార్టీని నామరూపాల్లేకుండా పెకిలించామనుకున్నారు.. టీడీపీ పునరుజ్జీవనం కష్టమేనని అంచనాకు వచ్చేశారు… నేతలంతా పార్టీని వీడటంతో పదేళ్లుగా నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ కూడా జంప్ అవుతుందని లెక్కలు కట్టారు.. కానీ, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి వచ్చిన చంద్రబాబుకు హైదరాబాద్ లో దక్కిన ఆదరణ చూస్తే…తెలంగాణలో టీడీపీ ఇంకా పటిష్టంగానే ఉందని స్పష్టం అయింది.
ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి సాయంత్రం ఆరు గంటల నుంచి చంద్రబాబు ర్యాలీ ప్రారంభం అవుతుందని సమాచారంతో, నాలుగు గంటలకే తెలంగాణ తెలుగు తమ్ముళ్లు బేగంపేట్ విమాశ్రయం చేరుకున్నారు. చంద్రబాబు ఆలస్యంగా వచ్చినా గంటల తరబడి వేచి ఉన్నారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన కాసేపటికే వర్షం దంచికొట్టినా.. ఉప్పొంగిన అభిమానం ముందు జోరు వర్షం చిన్నబోయింది. ఎవరూ ర్యాలీ నుంచి నిష్క్రమించలేదు. చంద్రబాబు కాన్వాయ్ తోపాటే భారీ ర్యాలీగా కదిలారు.
తెలంగాణలో టీడీపీకి ఆదరణ లేదని అనుకున్నా వాళ్లంతా ఈ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. సొంత రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికినట్లే చంద్రబాబును తెలంగాణ స్వాగతించింది. ఈ నేలపై చంద్రబాబు వేసిన మార్క్ అలాంటిది. అందుకే ఈ స్వాగత ర్యాలీని చూసిన వారంతా టీడీపీని నేతలు వీడారు తప్పితే నిఖార్సైన క్యాడర్ ఇంకా పార్టీతోనే ఉందని రుజువు అయిందని అభిప్రాయపడుతున్నారు. తనకు దక్కిన ఈ అపూర్వ స్వాగతంతో చంద్రబాబు తెలంగాణపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టేందుకు ఈ పరిణామం కారణం కానుంది.