ఆంధ్రప్రదేశ్ కు రూ. లక్ష కోట్ల వరకూ ఆర్థిక సాయం కావాలని సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులకు విజ్ఞాపనపత్రాలు అందించారు. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ నెలలో ప్రవేశ పెట్టనున్నందున రెండురోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించి ప్రధానితో సహా కేంద్ర మంత్రుల్ని కలిశారు. అన్ని శాఖల్లోనూ విజ్ఞాపన పత్రాలు అందించారు. మొత్తంగా లక్ష కోట్ల సాయాన్ని చంద్రబాబు అడిగినట్లుగా మీడియా వర్గాలు ప్రకటించాయి.
చంద్రబాబు కేంద్రాన్ని ఏమేం అడిగారంటే ?
ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా ఏపీ కోలుకోవాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ఆర్థిక అవసరాలు తీరడానికి ప్రస్తుతం ఉన్న నిబంధల కన్నా జీడీపీలో అదనంగా అర శాతం అప్పు తీసుకునే అవకాశాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. అలాగే రాజధాని అమరావతి కోసం రూ. ఐదు వేలకోట్లు అడిగారు. తాజా బడ్జెట్లో పదిహేనను వందల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అాలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి ఆర్థిక సాయం అందుతున్నప్పటికీ కేంద్రం నుంచి బడ్జెట్ సపోర్టు పదిహేను వందలకోట్లు కావాలని అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర దేశవ్యాప్తంగా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగంగా ఏపీకి వెయ్యి కోట్లు కేటాయించాలని కోరారు.
ప్రత్యేక సాయం కాదు కేంద్రం ఖర్చు పెట్టే దాంట్లో నుంచే !
చంద్రబాబు కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలో ప్రత్యేకమైన కసరత్తు చేశారు. ఏపీకి నగదు బదిలీ చేయాలని ఆయన అడగలేదు. కానీ వ్యూహాత్మకంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పథకాల ద్వారా ఏపీకి కేటాయించగలిగే నిధుల గురించే ఆయన ఎక్కువగా విజ్ఞాపనపత్రాలు సమర్పించారు. ఫలనా పథకానికి దేశవ్యాప్తంగా ఇంత ఖర్చు పెడుతున్నారు. అందులో ఏపీలో ఈ పథకానికి ఇంత కేటాయించండి అని లెక్కలతో సహా అడిగారు. చంద్రబాబు ప్రణాళిక కేంద్ర మంత్రుల్ని కూడా ఆశ్చర్యపరిచింది.
అడిగినంత కాకపోయినా దండిగా సాయం చేయాల్సిందే !
గతంలోలా ఏపీ గురించి నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి కేంద్రానికి లేదు. మోదీ కూడా ఏపీ సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తామని చాలా సార్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీకి పదవుల కోసం పట్టుబట్టడం లేదు. తమకు రాజకీయ పదవులు అక్కర్లేదని ఏపీ కోసం సహకరిస్తే చాలని ఆయన అనుకుంటున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది. అడిగినంత కాకపోయినా ఈ సారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. అదనపు అప్పులకు అవకాశం ఇచ్చే చాన్సులు కూడా ఉన్నాయి.