అమరావతిలో కేంద్ర సంస్థల కార్యాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కానున్నాయి. ఐదేళ్ల కిందట స్థలాలు కేటాయించిన సంస్థలు జగన్ నిర్వాకం కారణంగా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇంకా చెప్పాలంటే వేయనివ్వలేదు. ఇప్పుడు సీన్ మారింది. దీంతో రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు వస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఢిల్లీ టూర్ లో ప్రతి రాష్ట్ర రాజాధానిలో ఆయా కేంద్ర శాఖలకు ఉండాల్సిన కార్యాలయాల నిర్మాణాలపైనా చర్చించారు. దాదాపుగా యాభై సంస్థలు స్థలం తమ చేతికి రాగానే నిర్మాణాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి.
ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి కనీసం పట్టించుకోకపోవడంతో మొత్తం అడవిలా అమరావతి పెరిగిపోయింది. చిల్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ గెలిచిన మరునాటి నుంచే జంగిల్ క్లియరెన్స్ ప్రారంభిచారు. ఈ పని పూర్తయిన తర్వాత ఆయా సంస్థలకు కేటాయించిన స్థలాల పొజిషన్ ఇస్తారు. ఆ వెంటనే నిర్మాణాలు ప్రారంభించనున్నారు. గతంలో ఆసక్తి చూపించిన ప్రఖ్యాత సంస్థలకు కూడా రిమైండర్స్ పంపుతున్నారు. వారికి ఉన్న సందేహాలను తీరుస్తున్నారు.
అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు ప్రారంభం కాగానే మిగతా సంస్థలన్నీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ ఓడిక ముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటలూ అమరావతిలో ఫ్లడ్ లైట్ల వెలుగులో పనులు జరుగుతూ ఉండేవి. వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఆ పరిస్థితి మరోసారి కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.