తెలుగు సినిమా మరోసారి రొమ్ము విరుచుకొనేలా చేశాడు నాగ్ అశ్విన్. ‘కల్కి’ రికార్డులు వేట ఇంకా కొనసాగుతోంది. తెలుగులో అత్యంత భారీగా తీసిన సినిమాల్లో, భారీ వసూళ్లు అందుకొన్న చిత్రాల్లో ‘కల్కి’ ఒకటిగా నిలిచిపోతుంది. ఎక్కడ చూసినా నాగ అశ్విన్‌కు ప్రసంశలు దక్కుతున్నాయి. రాజమౌళి తరవాత మరో కుర్చీ నాగ్ అశ్విన్‌కే అని కితాబులు ఇస్తున్నారు. అయితే ‘కల్కి’లోనూ తప్పులు లేకపోలేదు. ఈ సినిమాపైనా విమర్శలు రాకపోలేదు. వాటిని నాగ అశ్విన్ లైట్ గా తీసుకోలేదు. `సినిమా ఆడేస్తోంది కదా.. ఇవన్నీ పట్టించుకోకపోయినా ఫర్వాలేదు` అనుకోవడం లేదు. వాటినీ గ్రహించాడు. ‘యస్… కొన్ని తప్పులు జరిగాయి’ అని మనస్ఫూర్తిగా ఒప్పుకొన్నాడు. ఇదో మంచి లక్షణం. ‘ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే, రంధ్రాన్వేషణ చేస్తారా, మీకు సినిమా చూడడం వచ్చా’ అంటూ రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా, విమర్శల్ని స్వీకరించడం గొప్ప గుణం. ‘కల్కి 2’ని మరింత అందంగా, గొప్పగా తీర్చిదిద్దడానికి తనకు దక్కిన ఓ అవకాశం.
‘కల్కి’లో ప్రభాస్ స్క్రీన్ టైమ్ చూసి స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ హర్టయ్యారు. ఇది ప్రభాస్ సినిమానా, అమితాబ్ సినిమానా? అని ఫీలయ్యారు. దానిపై నాగ్ అశ్విన్ వివరణ చూడముచ్చటగా అనిపించింది. కల్కి అనే ప్రపంచాన్ని బిల్డ్ చేయడానికి, అది ప్రేక్షకులకు అర్థం అవ్వడానికి కొంత సమయం తీసుకొన్నానని, పైగా ఈసినిమాలో చాలా పాత్రలు ఉన్నాయని, ఒక్కో పాత్రనీ, ఆ పాత్ర లక్షణాల్ని అర్థమయ్యేలా వివరించడానికి సమయం పట్టిందని, రెండో భాగం చూస్తే ఆ వెలితి ఉండదని, వరల్డ్ బిల్డింగ్ ఉండదు కాబట్టి, ప్రతీ పాత్రనీ నేరుగా చూపించొచ్చని వివరణ ఇచ్చాడు అశ్విన్. సో.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ బెంగ తీరిపోయింది.
నేపథ్య సంగీతం బాగున్నా – ఎందుకో పాటలు ఎక్కలేదు. ఈ విషయం నాగ అశ్విన్‌కి కూడా అర్థమైంది. అందుకే పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందన్న నిజం ఒప్పుకొన్నాడు. కొన్ని పాత్రల డబ్బింగ్ కృతకంగా తయారైందన్న విమర్శ ఉంది. దీనిపై కూడా నాగ్ అశ్విన్ స్పందించాడు. ”ఎవరి పాత్రకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకొంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం. ‘మహానటి’లో కూడా అదే చేశాం. ‘కల్కి’ కోసం ఆ ప్రయత్నం చేశాం. అయితే చివర్లో సమయం సరిపోకపోవడం వల్ల..ఫైన్ ట్యూన్ చేసే అవకాశం రాలేదు” అని సమాధానం ఇచ్చాడు.
‘కల్కి’లో ప్రతీ సన్నివేశం వెనుక కొన్ని మెటాఫర్లు ఉంటాయి. ఈ పాత్ర, ఇలా ఎందుకు బిహేవ్ చేసింది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ”కల్కిని ఒకసారి చూస్తే ఒకలా అర్థం అవుతుంది. మరోసారి చూస్తే మరో కోణం ఆవిష్కృతం అవుతుంది. ఆ లేయర్లన్నీ తెలియాలంటే.. ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలి. అప్పుడు ఇంకాస్త బాగా అర్థం అవుతుంది” అని చెప్పుకొచ్చాడీ దర్శకుడు.
‘కల్కి’లో గెస్ట్ పాత్రలు చాలా వచ్చి పడిపోయాయి. కొన్ని నచ్చాయి. ఇంకొన్ని అస్సలు కిక్ ఇవ్వలేదు. అందులో రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఒకటి. అఫ్కోర్స్.. ఆయన ఎంట్రీకి థియేటర్లంతా షేక్ అయి ఉండొచ్చు. కానీ ఈ సీన్ ఈ కథలో ఎలాంటి ఇంపాక్ట్ కలిగించలేదు. అయితే… తెలుగు వాళ్లు గర్వపడే సినిమాలు తీసిన వర్మ, రాజమౌళి లాంటి వాళ్లు తన సినిమాలో ఉండాలనుకొన్నానని, ముఖ్యంగా కలియుగంలో వర్మలాంటి వ్యక్తిత్వాలు ఉన్నవాళ్లు ఉంటే చూడాలనిపించిందని చమత్కరించాడు. సో.. వర్మ ఎపిసోడ్ వెనుక కూడా దర్శకుడికి ఓ ప్రత్యేక ఉద్దేశం ఉందన్న విషయం అర్థమైంది.
కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది? అనే విషయంపై చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కలియుగంలో ఆరులక్షల సంవత్సరాల తరవాతే కల్కి అవతరిస్తాడని, అలాంప్పుడు 2898 ఏడీలోని కల్కి పుట్టబోతున్నట్టుగా ఎందుకు చూపించారన్నది ఓ విమర్శ.
దీనిపై నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానం సహేతుకంగా అనిపించింది. కలియుగంలో సంవత్సరాల్ని కొలిచే పద్ధతి విభిన్నంగా ఉంటుంది. కలియుగంలో యేళ్లు త్వర త్వరగా అయిపోతాయి. అందుకే తాను 2898 దగ్గరే కలియుగం అంతం అవుతుందని ఓ సృజనాత్మక ఊహ చేశాడు. కర్ణుడ్ని హీరోగా చేయాలనుకోవడమే నాగ అశ్విన్ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చాడు. చెడు వైపు నిలబడి యుద్ధం చేసినా, చివరికి ధర్మం గెలవాలనుకొంటాడని, అలా ఈ సినిమాలో ప్రభాస్ హీరో అవుతాడని తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పాడు.
మొత్తానికి ‘కల్కి’ ప్రెస్ మీట్ లో ఈ సినిమాపై వచ్చిన విమర్శలకు తనదైన శైలిలో సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాడు నాగ్ అశ్విన్. తన తప్పుల్ని తెలుసుకొన్నాడు. వాటిని సవరించుకొని ‘కల్కి 2’ని మరింత ఉన్నతంగా, గొప్పగా తీస్తాడన్నది అభిమానుల ఆశ. ఆకాంక్ష.