అమరావతిలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కారణంగా ఎప్పుడు నిర్మాణాలు ప్రారంభిస్తామో.. ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేకపోతున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. దశలవారీగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర సాయం కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాలనా నగరాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రజలతో అనుబంధాన్ని పెంచేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు.
పీయూష్ గోయల్‌తో భేటీకి ఆయన కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. అప్పుడు అమరావతిపై వారి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతున్నప్పుడే గోయల్ తన కార్యాలయం పై అంతస్తుకు చంద్రబాబును తీసుకెళ్లారు. అక్కడ్నుంచి కొత్తగా కట్టిన సెంట్రల్ విస్టాను చూపించారు. ఈ కొత్త పార్లమెంట్ భవనం దేశ ప్రజల మనసుల్లో ఓ ప్రత్యేకమైన ముద్ర వేసిందని.. అనుబంధాన్ని పెంచిందని గుర్తు చేసుకున్నారు. అందుకే అమరావతిలో పాలనా నగరాన్ని రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు చూసేందుకు …అందుబాటులోకి తేవాలని సలహా ఇచ్చారు. దీని వల్ల రాజధానిపై ప్రజల్లో అనుబంధం పెరుగుతుందని సలహా ఇచ్చారు.
గతంలో అమరావతి నిర్మాణం ఆలస్యమయింది. నిజానికి ఆలస్యం కాలేదు. రాజధాని నిర్ణయించడం అనే దగ్గర నుంచి ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు పూర్తి చేసి పాలన కూడా ప్రారంభించారు. ఐకానిక్ బిల్డింగులు కట్టడానికి పటిష్టమైన పునాదులు కూడా వేశారు. అప్పుడు ప్రభుత్వం మారింది. ఐదేళ్లలో అత్యంత ముఖ్యమైన పని పూర్తి చేసినట్లే. తర్వాత ఐదేళ్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు ఆ పునాదుల మీద నుంచి ప్రారంభించడమే మిగిలింది. అంటే.. నిర్మాణాలు కట్టదల్చుకుంటే… రెండేళ్లలో పూర్తి చేయవచ్చు. నిధుల సమస్య లేకపోతే చాలు.
సీడ్ క్యాపిటల్ తో పాటు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్స్ అన్నీ చివరి దశలో ఉన్నాయి. గోయల్ సలహా ఇచ్చినట్లుగ రెండేళ్లలో అన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే మిగతా అభివృద్ధి దానంతటకు అదే పరుగులు పెడుతుందన్న అభిప్రాయం. గోయల్ ఇచ్చిన సలహా మేరకు చంద్రబాబు కూడా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.