కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కల్లోలిత సమయం నుంచి బయటపడేందుకు మార్గాలను అంచనా వేయలేకపోతున్నారు. తెలంగాణ తెచ్చిన తాను ప్రతిపక్ష హోదాకు పరిమితం కావడం ఏంటి..? అని ఇంకా ఫీల్ అవుతూ ఫామ్ హౌజ్ లోనే సేదా తిరుతున్నారు. ఫామ్ హౌజ్ ను వీడి ప్రజల ముందుకు, పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు సాహసించడం లేదు. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి రాజకీయాల్లో కేసీఆర్ బేల స్థితిని చూసి బీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోతున్నారు. చాణక్య నీతితో రాజకీయాలు చేసిన కేసీఆర్ ఒక్క ఓటమితో కుంగిపోతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుత సమయంలో పార్టీని కాపాడుకునేందుకు సీరియస్ గా దృష్టిసారించాల్సిన కేసీఆర్..ఎమ్మెల్యేలు పార్టీని వీడే వరకు ఫామ్ హౌజ్ వేదికగా కనీసం రాజకీయ కార్యకలాపాలను షురూ చేయలేదు. తీరా ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై డిసైడ్ అయ్యాక నేనున్నానని భరోసా , వలసలకు ఎలా చెక్ పెడుతుంది..? ఈ చిన్న లాజిక్ ను కేసీఆర్ అంచనా వేయలేకపోవడం బీఆర్ఎస్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఇదే సమయంలో కేసీఆర్ ఇకనైనా మారాలని బహిరంగంగా ఆ పార్టీ నేతలు చెప్పకపోయినా అంతర్గతంగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 2019నుంచి 2024లో ఎన్నికల వరకు చంద్రబాబు ఎలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నారో వాస్తవాలు కళ్ళముంగిటే ఉన్నాయి. ఇరవై మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడారు. కేసులు పెట్టి, జైలుకు పంపినా జడవలేదు. ఫ్యామిలీని టార్గెట్ చేసినా వెన్ను చూపలేదు. చంద్రబాబు కష్టం ఎంతన్నది మాటల్లో చెప్పలేం. కానీ, కేసీఆర్ మాత్రం తనపై విశ్వాసం ఉంచకుండా అధికారం కోల్పోవడమే అవమానంగా ఫీల్ అవుతూ ఇంకా ఫామ్ హౌజ్ రాజకీయాలు చేస్తూ కూర్చుంటే రానున్న రోజుల్లో పార్టీలో కుటుంబ సభ్యులు మినహా ఎవరూ మిగలేరని సొంత పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.
అధికారం ఉన్నప్పుడు ఆ విజయగర్వం వేరే.. కానీ విపక్షానికి పరిమితమైనప్పుడే నాయకుడి సత్తా ఏంటో తెలుస్తుంది. అలాంటి సమయాల్లోనే మరింత యాక్టివ్ గా ఉండాలి. అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరించడం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేస్తోంది. ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు చంద్రబాబు ప్రదర్శించిన పోరాటతత్త్వం కేసీఆర్ ఫాలో కావాలని లేదంటే రాజకీయాల్లో బీఆర్ఎస్ మరింత పతనావస్థకు చేరుకోవాల్సి వస్తుంది.