తెలంగాణలో కొద్ది రోజులుగా నిరుద్యోగులుగా వస్తున్న డిమాండ్స్ పై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టిసారించింది. వెంట వెంటనే పరీక్షలుండటంతో నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందిగా ఉందని, పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదని నిరుద్యోగులు చెబుతున్న కారణాలతో ఏకీభవించింది.
తెలంగాణలో జులై 18వ తేదీ నుండి డీఎస్సీ పరీక్షలు ఆన్-లైన్ లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరగబోతున్నాయి. ఆగస్టు 7వ తేదీ నుండి గ్రూప్2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నందున ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్ సర్కార్ దృష్టికి వచ్చింది.
అయితే, డీఎస్సీకి ఇప్పటికే ఆన్ లైన్ డేట్స్ ఫిక్స్ చేయటం… గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను మార్చి కొత్త నోటిఫికేషన్ తో కొత్త తేదీ ఇచ్చినందున పరీక్షను వాయిదా వేస్తే ఇబ్బందులు వస్తాయని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. నిరుద్యోగుల డిమాండ్ తోనే టెట్ నిర్వహించటంతో ఇప్పటికే డీఎస్సీ ఆలస్యం అయ్యిందని, టెట్ పూర్తి అయ్యాక 6 నెలలు అయితే మరోసారి టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే డీఎస్సీ మరింత ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. పైగా… ఆన్ లైన్ డేట్స్ ఇతర పరీక్షల తేదీలతో ముడిపడి ఉంటాయి కాబట్టి డీఎస్సీని వాయిదా వేయకపోవమే మంచిదన్న నిర్ణయానికి సర్కార్ వచ్చినట్లు సమాచారం.
దీంతో, గ్రూప్2 వాయిదాకే సర్కార్ మొగ్గు చూపింది. దీంతో డీఎస్సీ పరీక్ష యాధావిధిగా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.