తెలంగాణలో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్న కే.కేశవరావు ఆ పార్టీని వీడుతూ, రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఆమోదించటంతో ఉప ఎన్నిక రాబోతుంది.
తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత బలాబలాలు చూస్తే… కే.కే రాజీనామాతో ఖాళీ అయిన సీటు కాంగ్రెస్ కే దక్కనుంది. నిజానికి రాజీనామా తర్వాత ఉప ఎన్నికలోనూ కేశవరావుకే అవకాశం ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ, కేకేకు క్యాబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి కట్టబెట్టడంతో… మరో నేతకు అవకాశం కల్పించటం ఖాయమైంది.
ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం చూసినా, కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూసినా… కొత్త రక్తానికే అవకాశం ఇస్తుంది. విధేయతకు తోడు యువ నాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అద్దంకి దయాకర్ కు అవకాశం ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడిన నేతగా, పార్టీ వాయిస్ బలంగా వినిపించిన నేతగా అద్దంకి దయాకర్ కు గుర్తింపు ఉంది. తుంగతుర్తి నుండి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం వస్తుందనుకున్నా చివరి నిమిషంలో మరో నేతకు ఇచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అద్దంకిని వెంటబెట్టుకొని మరీ ప్రచారం చేశారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్ నుండి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా కడియం కావ్యకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అద్దంకిని ఏం చేస్తారన్న విమర్శలు వచ్చినా… నేనున్నా అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు.
పైగా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో అద్దంకి దయాకర్ కు ఉన్న వైరం పోయింది. అద్దంకి దయాకర్ ను మంచి స్థానంలో చూడాలని ఉంది అంటూ మంత్రి కోమటిరెడ్డి ఓ సభలో కామెంట్ కూడా చేశారు. దీంతో ఈసారి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికలో అవకాశం రావొచ్చన్న అభిప్రాయం ఉంది.
బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వబోతున్న నేపథ్యంలో… సామాజికపరంగా కూడా అద్దంకికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే, కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే టెన్యూర్ ఉన్న నేపథ్యంలో… కాబోయే ఎంపీ అద్దంకియేనా, చివరి నిమిషంలో మరో పేరు ఎదైనా తెరపైకి వస్తుందో చూడాలి.