తెలుగు రాష్ట్రాల సీఎంలు మీటింగ్ ను లైవ్ ఇవ్వాలి… వారు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు తెలియాలి… ఏపీలో ఉన్న పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతున్న వార్తలు తమకు ఆందోళన కలుగుతున్నాయంటూ మాజీ మంత్రి బొత్స ట్వీట్ చేశారు.
సీఎంలు చంద్రబాబు-రేవంత్ రెడ్డి మధ్య మీటింగ్ అనగానే… తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీలో ఆందోళన కలుగుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు… విభజన సమస్యలపై మీటింగ్ అనగానే తాజా మాజీ అధికార పార్టీల మధ్య ఎందుకంత ఉలిక్కిపాటు అన్నది అందరినీ ఆలోచింపజేస్తుంది.
నిజానికి బాబు-రేవంత్ కన్నా కేసీఆర్-జగన్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రగతి భవన్ కు జగన్ వస్తే సీఎం, మంత్రులు, నేతలంతా రెడ్ కార్పేట్ వెల్ కం చెప్పేవారు. కేసీఆర్ కు కూడా అంతే. అప్పుడు ఎన్నిసార్లు కలిసినా… ఏ ఒక్కనాడు లైవ్ పెట్టలేదు. విందులే తప్పా, రాజకీయ కుట్రలే తప్పా సమస్యల పరిష్కారం కోసం ఒక్క అడుగు వేసింది లేదు.
కానీ నిజాయితీగా సీఎంలు మీటింగ్ పెట్టుకోగానే… ఇష్టానుసారంగా మాట్లాడటంపై ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మీటింగ్ లో సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్య అధికారులు కూడా పాల్గొంటారు. ఇది తెలిసి కూడా తెలియనట్లు నటిస్తూ, సెంటిమెంట్ తో పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఊహాజనిత వార్తలను మంత్రులుగా పనిచేసిన వారు కూడా కామెంట్ చేయటం… వారి మానసిక స్థితికి అద్ధం పడుతుందని ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.