స్నేహపూర్వక వాతావరణంలో విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. పదేళ్లుగా నానుతోన్న విభజన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఓ అడుగు వేశారు. శనివారం ప్రజా భవన్ లో చంద్రబాబు- రేవంత్ రెడ్డిలు సమవేశం కాబోతున్నారు. అయితే , ఈ ఒక్క భేటీతోనే విభజన సమస్యలు పరిష్కారం అవుతాయంటే పొరపాటే. కానీ, బీఆర్ఎస్ అతి తెలివో, రాజకీయమో కానీ అన్ని ఒకేపెట్టున పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తోంది.
ఏడు మండలాలు, విద్యుత్ , జల వివాదాలపై చర్చించి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చేలా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని పట్టుబడుతోంది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతానికి ఎలాగైతే మేలు జరగాలని రేవంత్ కోరుకుంటాడో, అదే తరహాలో ఏపీ ముఖ్యమంత్రి కూడా కోరుకుంటాడనడంలో సందేహం లేదు. అది సహజం. దానిని రాజకీయం కూడా అనలేం. పదేళ్లుగా నానుతోన్న ఈ విభజన సమస్యలను రాజకీయ కోణంలో ఆలోచిస్తూ, చర్చిస్తూ కూర్చుంటే ఎన్నటికీ పరిష్కారం కావు. పదేళ్లుగా ఇదే జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు మేలు చేసేందుకు విభజన వివాదాలను అదే పనిగా నాన్చాల్సిన అవసరం లేదు. ఒకరు ఒక విషయంలో తగ్గితే.. మరొకరు ఇంకో విషయంలో తగ్గితే ఈ సమస్యలను పరిష్కరించుకోవడం సులువు. స్నేహపూరిత వాతావరణంలో ముఖ్యమంత్రులు తగ్గి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా విమర్శలు చేసి అలజడి సృష్టించేందుకు ప్రత్యర్ధులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు.
ఇక, ఎలాంటి ముందడుగు పడకుంటే ముఖ్యమంత్రుల భేటీతో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించే అవకాశమూ ఉంది. ముఖ్యమంత్రులు బెట్టు వీడి కీలక నిర్ణయాలు తీసుకుంటే అది రాష్ట్రానికి ద్రోహం అంటూ విమర్శలను ఎక్కుపెట్టే అవకాశం ఉంది. సున్నితమైన ఈ అంశాల్లో రాజకీయ లాభాపేక్షను ప్రతిపక్షాలు వదిలేస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం తొందరగా లభిస్తుంది.
అదే సమయంలో ముఖ్యమంత్రులకు విభజన సమస్యల పరిష్కారంపై ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత ప్రతిపక్షాలకూ ఉంది. కానీ, విభజన వివాదాలను రాజకీయ లాభాపేక్షతో చూస్తే మాత్రం ఎన్నటికీ వీడని సమస్యలుగానే అలాగే ఉండిపోతాయి. దీంతో ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతిపక్షాల రాజకీయంతో వెనుకంజ వేస్తుంటాయి. ఈ పాపాన్ని ప్రతిపక్షాలూ మోయాల్సి వస్తుంది అన్నది గుర్తెరగాలి. కానీ , బీఆర్ఎస్ ఆ ఆలోచన చేస్తుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.