‘హనుమాన్’ క్లైమాక్స్ లోనే ‘జై హనుమాన్’ 2025 సంక్రాంతికి వస్తోందని అనౌన్స్ మెంట్ కార్డ్ వేశారు. ‘హనుమాన్’ విజయం తర్వాత ‘జై హనుమాన్’ పనులు మొదలైపోయాయని ప్రకటించారు. అయితే తర్వాత ప్రశాంత్ వర్మ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. ‘జై హనుమాన్’ పనులకు బ్రేక్ పడ్డాయి. సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనిపించలేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా చెప్పారు నిర్మాత చైతన్య రెడ్డి.
‘జై హనుమాన్ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు, కనీసం రెండేళ్ళ పట్టే అవకాశం వుంది. ఇప్పడే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. హనుమాన్ మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది. మార్వల్ లాంటి కథ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సమయం పడుతుంది. ప్రేక్షకులు అంచనాలకు తగట్టుగా జై హనుమాన్ ని తీర్చిదిద్దడాని మావంతు ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు చైతన్య. నిజానికి ‘జై హనుమాన్’ స్క్రిప్టు కూడా ప్రశాంత్ వర్మ దగ్గర సిద్ధంగా లేదు. ఐడియా వరకు మాత్రమే ఉంది. అందుకే కొంతమంది రైటర్లతో ‘జై హనుమాన్’ స్క్రిప్టుని రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వస్తే కానీ, ‘జై హనుమాన్’ ఎప్పుడు పట్టాలెక్కేది, ఎప్పుడు విడుదల అయ్యేది అనే విషయాల్లో ఓ స్పష్టత రాదు. ఇటీవల ప్రశాంత్ వర్మ రవితేజను కలుసుకొన్నారు. ఈ కలయిక ‘జై హనుమాన్’ గురించేనా, లేదంటే కొత్త ప్రాజెక్టు గురించి ఏమైనా చర్చించుకొంటున్నారా? అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బాలయ్య గనుక తొందరపెడితే.. `జై హనుమాన్`ని పక్కన పెట్టి, మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలు ప్రశాంత్ వర్మ తీసుకొనే అవకాశం ఉంది.