ఏపీలో రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ సారధ్యంలోని షో టైం టీడీపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిందన్న సంగతి తెలిసిందే. రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ వ్యూహాలకు ధీటుగా ప్రణాళికలు సిద్దం చేసి వైసీపీని మట్టికరిపించింది. వందల కోట్లు తగలేసినా ఐ ప్యాక్ వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదని జగన్ అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం రాబిన్ శర్మ టీమ్ అందించిన వ్యూహాలు ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదం చేశాయని బలంగా నమ్ముతున్నారు.
రాబిన్ శర్మ టీం సేవలపై సంతృప్తిగా ఉన్న చంద్రబాబు, షో టైం సేవలను ఇంకా కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, పార్టీని మరింతగా శక్తివంతంగా మార్చడం వంటి కీలక అంశాల్లో నివేదికలను ఇచ్చేలా వారి సేవలను వాడుకోవాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల గురించి ప్రజాభిప్రాయ సేకరణను ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలని చంద్రబాబు కోరినట్లుగా సమాచారం.
టీడీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించి పెట్టడంతో దేశవ్యాప్తంగా రాబిన్ శర్మకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజకీయ వ్యూహకర్తగా రాబిన్ శర్మను నియమించుకోవాలని ఫిక్స్ కావడంతో ఇక శివసేనకు తన సేవలు అందించనున్నారు రాబిన్ శర్మ.
రాబిన్ శర్మ మహారాష్ట్ర వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని తేలడంతో టీడీపీకి ఆయన టీం సేవలపై సస్పెన్స్ నెలకొంది. అయితే, రాబిన్ శర్మ మహారాష్ట్రకు వెళ్ళినా ఏపీలో ఆయన టీం సేవలు ఎప్పటిలాగే టీడీపీకి కొనసాగనున్నాయి. షో టైంలో శర్మ తర్వాత వ్యవహారాలను చూసే శంతనుకు ఏపీ బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తోంది.