టీ 20లో ఏ జట్టునీ తక్కువ అంచనా వేయకూడదన్న సత్యం మరోసారి తెలిసొచ్చింది. అందుకు భారత్ భారీ మూల్యమే చెల్లించుకొంది. టీ 20 ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన వారం కూడా కాకుండానే భారత్ పసికూన జింబాంబ్వేపై ఘోర పరాజయం పాలైంది. జింబాంబ్వేతో జరుగుతున్న టీ 20 సిరీస్లో భాగంగా ఈ రోజు హరారేలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. పసికూనలే… అని లైట్ తీసుకొన్నందుకు గట్టి మూల్యమే చెల్లించుకొంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాంబ్వే 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ విజయం ముంగిట చతికిల పడింది. కేవలం 102 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సివచ్చింది. అయితే 2 పరుగులు మాత్రమే చేసింది. దాంతో… 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జింబాంబ్వేని తక్కువ అంచనా వేసిన భారత్ ఈ సిరీస్కు ద్వితీయ శ్రేణి జట్టుని పంపింది. శుభ్మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించాడు. వరల్డ్ కప్ లో ఆడిన ఏ ఒక్క ఆటగాడూ ఈ టీమ్ లో లేడు. దాంతో వరల్డ్ ఛాంపియన్లకు పరాభవం తప్పలేదు. ఈ యేడాది టీ 20లలో భారత్ కు ఇదే తొలి పరాజయం. 5 మ్యాచ్ల సిరీస్ కాబట్టి భారత్ తిరిగి పుంజుకొనే ఛాన్సుంది.