ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాభవన్ లో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. రెండు కమిటీలు వేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఓవరాల్ గా చూస్తే ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకలేదు. అలాగని ఫలితం లేదని చెప్పలేము. ఎలాంటి సమస్యలకు అయినా పరిష్కారానికి ప్రయత్నాలు జరిగితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభమవడమే అసలు సక్సెస్.
తమ ప్రయత్నాలపై ఇతర పార్టీలు రాజకీయం చేస్తాయని విషం చిమ్ముతాయని ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలుసు. కానీ ముఖ్యమంత్రులుగా వారి బాధ్యతలపై వారికి క్లారిటీ ఉంది. అందుకే ముందుకే అడుగేశారు. నిజానికి ఇలాంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి గత ఐదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. బేసిన్లు, భేషజాలు లేవని కేసీఆర్ చెప్పేంత సాన్నిహిత్యం నాటి ముఖ్యమంత్రుల మధ్య ఉంది. కానీ వారు కేవలం రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు. తమ రాష్ట్ర వివాదాల్ని కోర్టులకు పంపడానికి సైతం సిద్ధపడ్డారు… కానీ ముఖాముఖి చర్చలు జరపడానికి ఆసక్తి చూపలేదు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సుల్ని ఆపినా జగన్ అడగలేకపోయారు.
ఈ పరిస్థితుల నుంచి రాజకీయాలతో పాటు… రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కూడా ముఖ్యమేనని ఇద్దరు ముఖ్యమంత్రులు ముందడుగు వేశారు. ఓ ప్రయత్నం జరిగింది. ముందు ముందు ఎంత నిర్మాణాత్మకంగా సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతాయన్నదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అవి కూడా ఫలితాలను ఇస్తాయని శనివారం భేటీ ఆశలు రేపింది. ఈ చర్చల నుంచి రాజకీయం పిండుకుని ప్రజల్ని రెచ్చగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటి రాజకీయాల్ని కూడా ఈ ముఖ్యమంత్రుల్ని ఎదుర్కోవాలి. అదో సవాలే !