గ్రేటర్ బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ లో విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ లో శ్రీధర్ బాబుతో సమావేశానికి మాత్రం కలసి కట్టుగా వెళ్లారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరేందుకు వెళ్లామని వారంటున్నారు. కానీ అసలు మ్యాటర్ మాత్రం.. పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకోవడానికని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఫలితాలు రాలేదు. ఒక్కరే గెలిచారు. మిగతా అంతా బీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్యేలే. పాతబస్తీ మజ్లిస్ ఎమ్మెల్యేలను పక్కన పెడితే అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. వారిలో ఒక్క పద్మారావు మినహా మిగతా అందరూ వలస వచ్చిన వాళ్లే. ముఖ్యంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బలప్రయోగం ద్వారా చేర్చుకున్నవాళ్లే. ఇప్పుడు వాళ్లంతా పక్క చూపులు చూస్తున్నారు.
శ్రీధర్ బాబును కలిసిన వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి ఇద్దరే కాంగ్రెస్ మూలాలున్న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కె.వివేకానంద, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మల్లారెడ్డి అల్లుడు కూడా మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా టీడీపీ ఖాతానే అనుకోవచ్చు. వీరంతా నియోజకవర్గాల అభివృద్ధి పేర అధికారపార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టి… తాను, తన తల్లి పార్టీ మారడం లేదని పటోళ్ల కార్తీక్ రెడ్డి చెబుతున్నారు. కానీ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే సోనియా లేదా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.