మార్చి పదిహేనో తేదీ నుంచి కవిత జైల్లో ఉన్నారు. దాదాపుగా నాలుగు నెలలు అవుతోంది. బెయిల్ రాలేదు. వస్తుందన్న సూచనలు కూడా కనిపించడం లేదు. కవితకు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ప్రయత్నించాలని కేటీఆర్, హరీష్ రావు మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రయత్నిస్తున్నారా లేకపోతే మరో విధంగా ప్రయత్నిస్తున్నారా అన్న సంగతి పక్కన పెడితే.. కవిత బెయిల్ ఒక్క కవితతో ముడిపడి ఉండదనేది న్యాయనిపుణులు చెబుతున్నమాట.
కేజ్రీవాల్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనకు కింది కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ హైకోర్టు కొట్టివేసింది. ఆయన కూడా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ వస్తే… కవితకు కూడా తర్వాత విడతలో బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందుగానే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం పెద్దగా లేవని చెబుతున్నారు. అయితే ఏవో సంకేతాలు ఉండబట్టే హ రీష్, కేటీఆర్ ఢిల్లీలో మకాం వేశారని బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి.
డిప్యూటీ సీఎంగా సిసోడియా అరెస్ట్ అయిపోయి ఏడాది దాటిపోయింది. ఆయనకూ బెయిల్ రాలేదు. లిక్కర్ స్కాంలో అప్రూవర్లుగా మారిన వారికి తప్ప నిందితులకు బెయిల్ రావడం గగనంగా మారింది. అయితే ఈడీ లేకపోతే సీబీఐ వెంటాడుతున్నాయి. ఇంకా ఎంతో కాలం ఈ కేసుల పేరుతో వారిని జైళ్లలో ఉంచడం సాధ్యం కాదని దర్యాప్తు సంస్థలు అనుకుంటే.. తప్ప వారికి బెయిల్ లభించే అవకాశాలు తక్కువేనన్నది న్యాయనిపుణుల అంచనా.