భారత రాష్ట్ర సమితి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టి తన ఓటమితో దేశం బాధపడుతోందని చెబుతున్నారు కానీ తమకు అలాంటి బాధలేం లేవని.. పార్టీ మారిపోవడానికి ఎమ్మెల్యేలు దారులు వెదుక్కుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్టేమిటంటే ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ వైపు చూడటం లేదు. అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ కు తెలంగాణలో పవర్ ఉండవచ్చు కానీ.. బీజేపీకి కేంద్రంలో పవర్ ఉంది. మరి ఎందుకు ఆ పార్టీ వైపు చూడటం లేదు ?
ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు బీజేపీ కూడా ఆసక్తి చూపిస్తుంది. అందులో సందేహం ఉండదు. కానీ కాంగ్రెస్ తరహాలో ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. చేరుతామని వచ్చే వారి విషయంలో మాత్రం ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేత … కాంగ్రెస్ లోకి పోయేవారిని ఆపేందుకు… బీజేపీలోకి రావాలని లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉండాలని హెచ్చరికలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం భయపడటం లేదు.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సరి పెట్టుకోరు.. భారీ స్థాయిలో చేయాలనుకుంటారు. అయితే తెలంగాణలో గతంలో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బెడిసికొట్టడంతో ఈ సారి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఎంత మంది బీఆర్ఎస్ లో చేరినా అది బీజేపీకే లాభమని… అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎంత బలహీనం అయితే… బీజేపీకి అంత లాభం అని లెక్కలేసుకుంటున్నారు. అంతే కాదు.. భవిష్యత్ లో కేసీఆర్ బీజేపీ పంచన చేరినా ఆశ్చర్యం లేదన్న భావనతో కాంగ్రెస్ గూటికే చేరుతున్నారు.