మీర్జాపూర్ వెబ్‌సిరీస్ గురించి పరిచయం అవసరం లేదు. భాష, ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా పాపులరైన సిరీస్ ఇది. ఇప్పటివరకూ వచ్చిన రెండు సీజన్ లు సూపర్ హిట్ అయ్యాయి. మూడో సీజన్ పై అంచనాలు పెంచాయి. మేకర్స్ కూడా దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్నారు మూడో సీజన్ కోసం. మరి ఇంతలా ఎదురుచుసేలా చేసిన మీర్జాపూర్- 3 అంచనాలను అందుకుందా? మీర్జాపూర్ కుర్చీ ఆట అలరించిందా?
రెండు సీజన్ ల కథని రివైండ్ చేసుకుంటే.. మీర్జాపూర్ డాన్ అఖండానంద్ త్రిపాఠి అలియాస్ కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి). డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, సెటిల్మెంట్స్.. ఇలా తను చేయని దందా లేదు. మీర్జాపూర్ లో కాలీన్ భయ్యా మాటే వేదం. కాలీన్ భయ్యా కొడుకు మున్నా (దివ్యేందు). మీర్జాపూర్ సింహాసనంపై ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని తహతహలాడుతంటాడు. అయితే కాలీన్ భయ్యాకి మున్నా శక్తిసామర్ధ్యాలపై గురి కుదరదు. అదే వూర్లో వున్న లాయర్ రమాకాంత్ పండిత్ (రాజేశ్ తైలాంగ్)కు ముగ్గురు పిల్లలు. గుడ్డు పండిత్ (అలీ ఫజల్), బబ్లూ పండిత్ (విక్రాంత్ మస్సే), డింపీ (హర్షిత). కాలీన్ భాయ్ కొడుకు మున్నాని కాదని తన వ్యాపార సామ్రాజ్యన్ని పెంచే బాద్యత గుడ్డు, బబ్లూలకు అప్పగిస్తాడు. దీంతో మున్నా రగిలిపోతాడు. లాగే డింపీ స్నేహితురాలైన స్వీటీని ప్రేమిస్తాడు గుడ్డు. స్వీటీ అంటే మున్నాకి కూడా ఇష్టం. స్వీటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న కోరికతో మున్నా…సమయం చూసుకుని గుడ్డు, అతడి స్నేహితులను చంపాలనుకుని ఓ అటాక్ ప్లాన్ చేస్తాడు. ఈ ఎటాక్ లో స్వీటీతో పాటు బబ్లూ చనిపోతారు.
మున్నా చేసిన దాడి నుంచి తప్పించుకున్న గోలు(శ్వేతా త్రిపాఠి) గుడ్డు, మున్నాపై ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతూ ఉంటారు. మరోవైపు తన తండ్రి కాలీన్ భాయ్‌ను మోసం చేసేందుకు శరద్ శుక్లా( అంజుమ్ శర్మ )తో చేతులు కలుపుతాడు మున్నా. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ సీఎం కుమార్తె మాధురి (ఇషా తల్వార్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మున్నా. మీర్జాపూర్ సింహాసనాన్ని ఎక్కేందుకు తన తండ్రి కాలీన్ భాయ్‌ను చంపడానికి మున్నా ప్లాన్లు వేస్తుండగా, మున్నాపై పగతీర్చుకునేందుకు గుడ్డు, గోలు పెద్ద ఎటాక్ ని ప్లాన్ చేస్తారు. ఈ ఎటాక్ లో మున్నా చనిపోతాడు. తీవ్రంగా గాయపడిన కాలీన్భయ్యాని శరద్ కాపాడతాడు. ఇక్కడికి ఆగింది సీజన్ 2. దీని తర్వాత ఏం జరిగింది? గుడ్డు మిర్జాపూర్ సింహాసనం మీద కూర్చున్నాడా? శరద్ ప్లాన్ ఏంటి? కాలీన్ భయ్యా ఏమయ్యాడు? మిర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కింది? ఇదంతా సీజన్ 3 లో చూడాలి.
మీర్జాపూర్ కథలో ఎన్ని పాత్రలు వున్నా ఈ సిరీస్ ని పండించింది మాత్రం రెండు పాత్రలే.. కాలీన్ భయ్యా, మున్నా భయ్యా. ఈ ఇద్దరూ క్రిమినల్స్ అని తెలిసినా సిరీస్ చూస్తున్న ఆడియన్స్ విపరీతంగా ఆ పాత్రలకు కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా మున్నాకి. ఈ పాత్రకి ఒక కల్ట్ ఫాలోయింది వచ్చేసింది. తెలుగులో కూడా మున్నా మీమ్స్ తెగ పాపులర్. ఆ తండ్రి కొడుకుల బాండింగ్, వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు, మున్నా పాత్ర నడిచే తీరు సిరీస్ ని ఫేవరట్ గా మార్చేసింది.
అయితే సిరీస్ కి ప్రాణం లాంటి ఆ పాత్రని సీజన్ 2లో ముగించేశారు. మరో పవర్ ఫుల్ రోల్ కాలీన్ భయ్యాపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో సీజన్3 లో చూపించడానికి ఏముటుందనే ప్రశ్న అందరిలో వుంది. మున్నా లేని మిర్జాపూర్ రక్తికడుతుందా? అనే సందేహాలు వచ్చాయి. ఈ సందేహమే నిజమైంది. మున్నాలేని మిర్జాపూర్ లో మ్యాజిక్ మిస్ అయ్యింది. పది ఎపిసోడ్స్ (ఒకొక్క ఎపిసోడ్ నిడివి దాదాపు గంట)లా సీజన్ 3.. అంచనాలని అంతగా అందుకులేకపోయింది.
గుడ్డు, శరద్ ల మధ్య మిర్జాపూర్ సింహాసనం కోసం పోటీని ఎస్టాబ్లెస్ చేస్తూ తొలి ఎపిసోడ్ ప్రారంభమౌతుంది. అయితే ఇదే పాయింట్ ని ఏడో ఎపిసోడ్ వరకూ సాగదీశారు. వాళ్ళ ఇద్దరిమధ్య కుర్చీ గేమ్ అంత ఆసక్తిగా వుండదు. మిర్జాపూర్ పైకి క్రైమ్ సిరిస్ లా అనిపించినా తొలి రెండు సీజన్స్ లో పాత్రలు, వాటి చుట్టూ వున్న బ్యాక్ స్టోరీలు, ఎత్తుగడలు ఆసక్తిగా సాగుతాయి. సీజన్ 3లో ఆ ఆసక్తి తగ్గింది. కథా గమనం చాలా ప్లాట్ గా వెళుతుంటుంది. పైగా సన్నివేశాలు నడపడంలో చాలా ల్యాగ్ కనిపిస్తుంది. మున్నా భాయ్ లేడనుకుంటే, మరో షో రన్నర్ లాంటి క్యారెక్టర్ కాలీన్ భయ్యాని ఏడో ఎపిసోడ్ వరకూ మంచానికి పరిమితం చేయడం పెద్ద మైనస్ గా మారింది.
ఎనిమిదో ఎపిసోడ్ నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. గుడ్డు జైలుకి వెళ్ళడం, కిడ్నాప్ బారి నుంచి గోలు తప్పించుకోవడం, శరద్ గురించి మాదురి ఓ నిజం తెలియడం, తర్వాత కాలీన్ భయ్యా అసలు సీన్ లోకి ఎంటరై ఇచ్చిన ముగింపు సీజన్ 4పై ఆసక్తిని పెంచేలానే వుంటుంది. అయితే సీజన్ 3 మాత్రం మిర్జాపూర్ ఒరిజినల్ ఎసెన్స్ ని చూపించడంలో పట్టుతప్పింది. మిర్జాపూర్ మేకింగ్ చాలా ‘రా’గా వుంటుంది. ఇందులో ఆ రానెస్ పోయింది. చాలా సన్నివేశాలు, సంభాషణలు పాలిష్ చేసినట్లు స్పష్టంగా అర్ధమౌతుంటుంది. నాలుగు ఎపిసోడ్స్ లో చెపాల్సిన కథని పది ఎపిసోడ్స్ కి లాగిన వైనం సహనానికి పరీక్షలా వుంటుంది.
గాయపడిన కాలీన్ భయ్యాకి ఈ సీజన్ ఒక రికవరీలానే చూపించింది. చివరి సీన్ లో తప్పితే ఆ పాత్ర సిలైన్ తో వున్న పేషెంట్ లానే దీనంగా కనిపించింది. గుడ్డు చివరివరకూ తన పాత్రలోనే వున్నాడు, తన నటనలో సిన్సియారిటీ కనిపించింది. శరద్ గా కనిపించిన అంజుమ్ శర్మ డీసెంట్ గా కనిపించాడు. ఆ పాత్రని కూడా ముగించేశారు. మిర్జాపూర్ లో త్రిపాఠి, శుక్లా, పండిట్ కుటుంబాలే కాకుండా త్యాగీ ఫ్యామిలీ కూడా కీలకమే. భరత్ త్యాగీ పాత్రలో విజయ్ వర్మ స్క్రీన్ టైం ఎక్కువే వుంది కానీ ఆ పాత్ర ఇంపాక్ట్ ఫుల్ గా లేదు. దద్దా క్యారెక్టర్ లో కూడా గత మెరుపులు లేవు. గోలుని కూడా కట్టిపడేశారు. సీఎం మాధురిగా ఇషా హుందాగా కనిపించింది. క్లైమాక్స్ లో ఆమెదే కీ రోల్. మిగతా పాత్రలన్నీ పరిధిమేరకు కనిపించాయి.
టెక్నికల్ గా సిరిస్ ఓకే. కెమరాపనితనం, నేపధ్య సంగీతం డీసెంట్ గా వున్నాయి. గతంతో పోలిస్తే మాటల్లో మొరటుతనం తగ్గింది, బహుశా ఓటీటీ సెన్సార్ ఎఫెక్ట్ కావచ్చు. కథ, కథనాలు గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకులు గుర్మిత్ ఆనంద్ ఇంకాస్త బలంగా పని చేయాల్సింది. మొత్తానికి గత రెండు సీజన్స్ తో పోలిస్తే మిర్జాపూర్- 3 పెద్ద మెరుపులు లేకుండ చప్పగా సా…గింది.