అమరావతి రాజధానిపై ఉన్న వివాదం సమసిపోయినట్లే. ఇక రాజధాని ఏది అన్న ప్రశ్న రాదు. అలాగే అన్యాయం చేస్తారు అని రైతులు కూడా అనుకోరు. కానీ జగన్ ప్రభుత్వం తీరు వల్ల అమరావతిపై అనేక కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ విధానం మారిపోయింది కాబట్టి… ఆ కేసులను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి విషయంలో వేర్వేరు కోర్టుల్లో 100కుపైగా కేసులు ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఆరు కేసులు, హైకోర్టులో ఒకటి ఉన్నాయి. రైతులు వ్యక్తిగతంగా 100కుపైగా కేసులు దాఖలు చేశారు. ప్రభుత్వం మారడంతో పాటు, నూతన ప్రభుత్వం అమరావతికి అనుకూల వైఖరి తీసుకోవడంతో కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు నిర్ణయించునే అవకాశం ఉంది. ప్లానుకు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేయడంపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు పాత ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు పెట్టిన కేసులను వెనక్కి తీసుకున్నటు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాల్సిఉంది. అలా దాఖలు చేసిన తరువాత 90 రోజుల్లోపు ఎప్పుడైనా కేసులను కొట్టివేసే అవకాశం ఉంది. మూడు రాజధానుల అంశంపైనా సుప్రీం కోర్టులో కేసు ఉంది. దానిపై ప్రభుత్వ వాదన మారిపోయినట్లే కాబట్టి అదీ పరిష్కారమవుతుంది.
అలాగే అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన 350కిపైగా కేసులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి ఉంది. కేసులు ఎత్తేసే అంశంపై సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఉండటంతో వాటికి అనుగుణంగా ఈ వ్యవహారం చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరు నెలల్లో అన్ని కేసులనూ పరిష్కరించనున్నారు