సార్ ను ఒక్కసారి కలవాలి… సీఎంగారికి సారీ చెప్పాలి… ఒక్కసారి కలిసి వెళ్లిపోతా…. జగన్ ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి పరిస్థితి ఇది. ఆనాడు టీడీపీ-జనసేన నేతలపై జగన్ సర్కార్ చేసిన వేధింపుల్లో పీఎస్ఆర్ ఆంజనేయులు… ఇప్పుడు ప్రాదేయపడుతూ కనపడుతున్నారు. ఇప్పటికే పలుసార్లు సీఎం చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసినా, ఆయన నో చెప్పటంతో అధికారులు ఈ సీనియర్ ఐపీఎస్ ను గేట్ దగ్గర నుండే పంపించి వేస్తున్నారు.
జగన్ పాశవిక ఆనందం పొందిన ఘటనలైన మాజీ స్పీకర్ కోడెలపై దొంగతనం కేసు, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి- ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిలను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కడప జైలుకు పంపటం… జైల్లో సరైన ఆహారం కూడా అందకుండా చేయటం, చంద్రబాబుకు అండగా ఉన్నారన్న కారణంగా అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసు పెట్టి జైల్లో పెట్టడం, సంగం డైయిరీ చైర్మన్ దూళిపాళ్లను టార్గెట్ చేయటం… ఇలా ఎన్నో అంశాల్లో పీఎస్ఆర్ ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి.
అంతేకాదు జగన్ తాడేపల్లి గూడెం ప్యాలెస్ లో ఈయనకు ఓ ప్రత్యేక గది ఉందని… అందులో నుండి ఈ ఆపరేషన్లు నడిచాయన్న చర్చ అధికార వర్గాల్లో ఉంది. నిజానికి జగన్ అధికారంలోకి రాకముందు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈయన, తర్వాత జగన్ హాయంలో చక్రం తిప్పారు.
ప్రస్తుతం మరో రెండు సంవత్సరాలు ఇంకా సర్వీసు ఉన్నా… వీఆర్ఎస్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, చివరి ప్రయత్నంగా సీఎంను కలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం ఈయనపై కనికరం చూపే అవకాశం ఏమాత్రం లేదని టీడీపీ వర్గాలంటున్నాయి.