తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కకావికలం అవుతోన్న బీఆర్ఎస్..బీజేపీ ప్లాన్ తో మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతోందన్న వాదన వినిపిస్తోంది.
అసెంబ్లీ సెషన్ లోపు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమని బీజేపీ అంచనా వేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వెళ్ళలేని కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేయాలనే కండిషన్ విధిస్తుండటంతోనే వారంతా బీజేపీలో చేరికపై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బండి సంజయ్ కూడా వెల్లడించారు.
అయితే, కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా లేని ఓ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేయలేమని పార్టీ పెద్దలకు ఆ నలుగురు వివరించినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎలాగూ.. బీఆర్ఎస్ ప్రధానప్రతిపక్ష హోదా కోల్పోతుందని, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు తమ చేరికలు ఉపయోగపడుతాయని ఎమ్మెల్యేలు సూచించినట్లుగా తెలుస్తోంది.
నేడో, రేపో మరో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని.. మరో నలుగురు బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం బీఆర్ఎస్ పెద్దల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇరువైపుల నుంచి బీఆర్ఎస్ టార్గెట్ గా దాడి కొనసాగుతుండటంతో ఆ పార్టీ కకావికలం అవుతోంది.