కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను 23న ప్రవేశ పెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కారణంగా గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అందులో పాలసీల పరంగా ఎలాంటి నిర్ణయాలు ఉన్నా మెజార్టీ ఎదురుచూసేది.. ఇన్ కం ట్యాక్స్ శ్లాబుల గురించే. పదేళ్ల కిందట యూపీఏ ప్రభుత్వంలో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులు, శ్లాబుల్లో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ రెండున్నర లక్షల వరకే మినహాయింపు. స్టాండర్డ్ డిడక్షన్ అని.. మరొకటని ఏవో కొన్ని మినహాయింపులు ఇచ్చారు కానీ.. వేతన జీవులకు మాత్రం..తమ జీతంలో కట్ అయిపోతున్న ట్యాక్స్ ను చూసి… రేపు జాబ్ పోతే కనీసం కట్టిన ట్యాక్స్ అయినా వెనక్కి ఇస్తారా అని మథనపడుతూంటారు.
ఓ వేతన జీవి తన సంపాదనకు.. ఆదాయపు పన్ను కట్టి… ఆ తర్వాత ఖర్చు పెట్టే ప్రతీ దానికి పన్నులు కట్టాలి. అంటే.. పన్ను మీద పన్ను. దీని గురించి ప్రజల్లో పూర్తి అవగాహన లేదు కానీ.. అవగాహన ఉన్న వారి కడుపు మండిపోతుంది. తాము ఇన్ని కష్టాలు పడుతూ.. ప్రభుత్వానికి ఇంత కట్టాల్సి వస్తుందా అని. ఒక్క లీటర్ పెట్రోల్ కొంటే .. అరవై రూపాయలకుపైగా పన్నులే. అంటే.. ఓ వాహనదారులు.. సగటును.. 30వేల వరకు పెట్రో పన్నులు కడుతున్నారు. ఇక ఇన్ కంట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ పోతే… కొనే ప్రతి వస్తువుపైనా జీఎస్టీ ఉంటుంది. అంటే ఓ సగటు జీతగాడి జీతంలో 40 శాతం పన్నుల రూపంలో పిండేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఆ కోపం .. బీజేపీపై ఎన్నికల్లో కనిపించింది. ఇంకా ఇదే పన్నులు పిండుకునే విధానం కొనసాగిస్తే… ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడం కష్టమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ కోపాన్ని బీజేపీ అర్థం చేసుకుందని .. వేతన జీవుల నుంచి పన్నులు పిండుకునే విధానం నుంచి కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ గత పదేళ్లుగా ఇలాంటివి చెబుతూనే ఉన్నారు. కానీ చేయడం లేదు. కానీ ఆశాజీవులు… ప్రజలు. నిర్మలమ్మ పద్దు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారో మరి