కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిస్టు లీడర్ గా పేరు పొందిన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితులుగా కింది కోర్టు గుర్తించిన వారందర్నీ హైకోర్టు సాక్ష్యాలు లేవని చెప్పి నిర్దోషులుగా విడిచి పెట్టింది. ఈ తీర్పును పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.. కానీ కొంత మందికి మాత్రం మరి కప్పట్రాళ్లను చంపిందెవరు ? అనే సందేహానికి వస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సింది వ్యవస్థలే.
ఇది ఒక్క కేసు కాదు… ఖచ్చితంగా శిక్ష పడిన కేసుల్లో దిగువ కోర్టు ఒకటి చెబితే.. ఎగువ కోర్టులు మరొకటి పూర్తి రివర్స్ లో తీర్పు చెబుతున్నారు. కింద కనిపించిన సాక్ష్యాలు.. పై స్థాయిలో ఎందుకు కనిపించడం లేదన్నది ప్రశ్న. వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నది భారత న్యాయవ్యవస్థ మొదటి సూత్రం అని చెబుతూంటారు. ఈ కారణంగా ఆ ఒక్క నిర్దోషిని ముందు పెట్టి వంద మంది దోషులు తప్పించుకునేందుకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
ఇటీవల సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో ఇలాంటి తీర్పులే వచ్చాయి. నెలల తరబడి నిందితుల్ని జైల్లో పెట్టినా .. దిగువకోర్టు శిక్షించినా.. ఎగువ కోర్టుల్లో అవి నిలబడటం లేదు. బాధితులకు న్యాయం జరగడం లేదు. ఆయేషా మీరా కేసులో అన్యాయం ఓ నిందితుడ్ని ఇరికించారని హైకోర్టులో స్పష్టం చేసింది. మరి అసలు నిందితుడెవరో పోలీసులే కాదు.. సీబీఐ కూడా పట్టుకోలేకపోతోంది.
ఇలాంటివి చిన్న చిన్న ఘటనలే కానీ.. .వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం బలపడాలంటే.. తప్పు చేసిన వారు శిక్షకు గురయి తీరుతారన్న నమ్మకం కలిగించాలి. అలా చేయాలంటే.. మరింత పారదర్శకత అవసరమని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన న్యాయసంహితతో అయినా సత్వర న్యాయాలు అందుతాయని ప్రజలు ఆశపడుతున్నారు.