ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో బాక్సాఫీసును కుదిపేసింది ‘టిల్లు స్క్వేర్’. క్రెడిట్ అంతా… హీరో సిద్దు జొన్నలగడ్డ తీసుకువెళ్లిపోయినా, ఈ సినిమాను నడిపించడంలో, సీక్వెల్ సినిమాతో సక్సెస్ టెంపోని కాపాడడంలో పేరు తెచ్చుకొన్నాడు దర్శకుడు మల్లిక్ రామ్. ‘టిల్లు స్క్వేర్’ తరవాత తన సినిమా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సందీప్ కిషన్‌తో జట్టు కట్టబోతున్నాడు. అయితే సినిమా కోసం కాదు, ఓ వెబ్ సిరీస్ కోసం.
నెట్ ఫ్లిక్స్ కోసం సందీప్ కిషన్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. దీనికి మల్లిక్ రామ్ దర్శకుడు. ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాత. ఇది వరకు రాజీవ్ చిలక అల్లరి నరేష్ తో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే విడుదలకు ముందు జరిగిన శాటిలైట్, ఓటీటీ బిజినెస్ తో.. సినిమా సేఫ్ అయ్యింది. ఆ భరోసాతోనే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తున్నారు. ఈ సిరీస్ బ్యాక్ డ్రాప్ ఏమిటి, ఎలాంటి జోనర్లో రూపొందుతోంది? అనే విషయాలు తెలియాల్సివుంది. ‘ఫ్యామిలీమెన్’ వెబ్ సిరీస్‌లో సందీప్ కిషన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో తనది అతిధి పాత్ర మాత్రమే. పూర్తి స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేయడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం త్రినాధరావు నక్కినతో సందీప్ ఓ సినిమా చేస్తున్నాడు. రావు రమేష్ కీలక పాత్రధారి. ఈ చిత్రం కోసం ‘మజాకా’ అనే పేరు పరిశీలిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత.