మంత్రి కొండా సురేఖ దూకుడు రాజకీయంతో రేవంత్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి తరపున రాజకీయం అంతా ఆయనే నడుపుతున్నారు. చేరికల వ్యవహారాన్ని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా చేరికల విషయంలో తమ మాటే వినాలని.., తమ వ్యతిరేకుల్ని చేర్చుకోవద్దని .. కొండా మురళి వేం నరేందర్ తో గొడవపడినట్లుగా ఒక్క సారిగా గుప్పుమంది. కొండా మురళి వ్యవహారం తెలియడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని గౌరవాన్ని పోగొట్టుకోవద్దని హెచ్చరించారని అంటున్నారు.
సీతక్క విషయంలోనూ కొండా దంపతుల వ్యవహారశైలి రేవంత్ కు నచ్చలేదని తెలుస్తోంది. పరకాలలో చేరికల విషయంలోనూ… తర్వాత సీతక్కతో వివాదాల విషయంలోనూ.. తాజాగా బస్వరాజు సారయ్య చేరిక విషయంలోనూ కొండా సురేఖ మాటలు చెల్లలేదు. కొండా దంపతులు రేవంత్ వద్ద నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సింది పోయి.. తమదైన శైలిలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడే ప్రయత్నం చేయడంతో రేవంత్ అసహనానికి గురైనట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చేరికను కొండా సురేఖ వ్యతిరేకించారు. ఆయనకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే నష్టపోయేది కొండా సురేఖనే. అందుకే తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో కొండా సురేఖ దంపతులు ఏం చేయాలో అర్థం కాక సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ తో గ్యాప్ ను కొండా దంపతులు పూడ్చుకుంటారా లేకపోతే.. సహజ శైలి రాజకీయం చేసి ఆయనకూ దూరమవుతారా అన్నది వరంగల్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్.