పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ఐదేళ్ల తర్వాత కార్యకర్తలు గుర్తుకొచ్చారు. పార్టీ పునాదులు కదులుతున్నాయని అంచనా వేసి కార్యకర్తల మదిని దోచేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు వాలంటీర్లతో అంతా జరిగిపోతుందని భావించినా ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. కార్యకర్తల బలం, ఆదరణ లేకపోతే పార్టీ ఎలాంటి ఫలితాలను మూటగట్టుకుంటుందో జగన్ రెడ్డికి మొన్నటి ఎన్నికలు రుచి చూపించాయి.
వైసీపీ ఓటమిపై అనేక దఫాలుగా పోస్ట్ మార్టం నిర్వహించిన జగన్, కార్యకర్తలను పక్కనపెట్టడం కూడా ఘోర పరాజయానికి ఓ కారణమని గ్రహించినట్టు ఉన్నారు. అందుకే పార్టీ కోసం పని చేసే క్యాడర్ ను దగ్గరికి తీసుకునే పనిలో పడ్డారు. కార్యకర్తల కోసం భీమా కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. కార్యకర్తలు ప్రమాదంలో గాయపడినా, మృతి చెందినా పార్టీ పరంగా అండగా ఉండేలా ఓ నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ ఆలోచనతో దూరమైనా క్యాడర్ మళ్లీ లైన్ లోకి వస్తుందని జగన్ భావించినా షాకింగ్ పరిణామాలే ఎదురు అవుతున్నాయి.
2019లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్ ను వదిలేసి, అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లకే ప్రాధాన్యత ఇచ్చారు. కార్యకర్తలను గౌరవించకపోవడం కాదు, కనీసం వారి గోడును పట్టించుకోలేదు. ఫలితంగానే సొంత పార్టీ క్యాడర్ కూడా ఎన్నికల్లో కూటమికి జైకొట్టింది. తీరా అధికారం పోగానే మళ్లీ ఇప్పుడు వైసీపీకి కార్యకర్తలు గుర్తుకొచ్చారు. ఆదుకునేందుకు నేనున్నానని జగన్ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ, కార్యకర్తలు మాత్రం జగన్ ను నమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు.