రెండు వారాలుగా ‘కల్కి’ జాతర కొనసాగుతోంది. ఈవారం ‘భారతీయుడు 2’ రాబోతోంది. వచ్చే వారంలో డార్లింగ్ వస్తోంది. ‘డార్లింగ్’ చిన్న సినిమానే అయినా, చాలా ఆకర్షణలు ఉన్నాయి. ప్రియదర్శి హీరోగా చేసిన సినిమా ఇది. ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాల్లో ప్రియదర్శి సీరియస్ రోల్స్ చేశాడు. ఈసారి మాత్రం తనదైన కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. నభా నటేషా ఇందులో హీరోయిన్. తను స్ల్పిట్ పర్సనాటిటీ ఉన్న అమ్మాయిగా కనిపించబోతోంది. అంటే… అపరిచితురాలు అన్నమాట.
ట్రైలర్ బాగుంది. పెళ్లి చేసుకొని, హాయిగా హనీమూన్ కోసం ఇటలీ వెళ్లాలని కలలు కనే కుర్రాడి కథ ఇది. పెళ్లయ్యాక భార్యతో ఎలాంటి పాట్లు పడ్డాడో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే నభా నటేషా పాత్రకే స్కోప్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో గెస్ట్ రోల్స్ కొన్ని ఉన్నాయట. చిత్రసీమలోని కొంతమంది హీరోలు, హీరోయిన్లూ అతిధి పాత్రలతో మెరిసే అవకాశం ఉందని టాక్. ఆ పాత్రలేమిటన్నది సస్పెన్స్‌గా ఉంచింది చిత్రబృందం. ‘కల్కి’లో కూడా కొన్ని అతిధి పాత్రలు ఉన్నాయి. ప్రత్యేకమైన సందర్భాలలో ఆ పాత్రలు తెరపైకొచ్చి ప్రేక్షకుల్ని షాక్ కి గురి చేశాయి. ఇప్పుడు ‘డార్లింగ్’ విషయంలోనూ అదే చేస్తున్నారు. ఈ క్యామియోలు ‘డార్లింగ్’కి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ సినిమాగానే అనిపిస్తున్నా, ఇందులో ఓ బలమైన సామాజిక సందేశం కూడా మేళవించారని తెలుస్తోంది. అదేమిటన్నది సినిమా చూశాకే అర్ధం చేసుకోవాలి. ఈనెల 19న ఈ చిత్రం విడుదల అవుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకుడు.