ఆస్కార్ నిజంగానే ప్రపంచంలోని అత్యుత్తమ నటులకే ఇస్తుందనుకొంటే ఆ అవార్డ్ కనీసం 10 సార్లు అందుకోగల సామర్థ్యం ఉన్న నటుడు కమల్ హాసన్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆస్కార్ లెక్కలు, వాళ్ల విధానాలూ వేరుగా ఉంటాయి. కాబట్టి మన నటులెవ్వరికీ ఆస్కార్ రాలేదు. ఇండియన్ సినిమా అంటే, ఆస్కార్ నిన్నా మొన్నటి వరకూ చిన్న చూపే చూసింది. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా స్టామినాని ఆస్కార్ అకాడమీ గుర్తించాల్సిన అవసరం వచ్చింది. `ఆర్.ఆర్.ఆర్`తో మన దేశం ఆస్కార్ గెలుచుకోవడమే అతి పెద్ద నిదర్శనం. కమల్ కు ముందు నుంచీ ఆస్కార్ అవార్డులపై పెద్దగా అభిప్రాయం లేదు. ‘వాళ్లు మనల్ని గుర్తించేదేంటి’ అనుకొంటారు. ఇప్పుడు కూడా అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు. ఆస్కార్ అకాడమీ మన సినిమాల్ని ఇప్పటికైనా గుర్తిస్తోంది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని కమల్ ని అడిగితే, ఆయన ఓ వెరైటీ సమాధానం చెప్పుకొచ్చారు.
”ప్రపంచంలో అత్యధిక సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తోంది ఇండియన్ ఇండస్ట్రీ. మనమే ఆస్కార్ కంటే పెద్ద అవార్డుల్ని ఇవ్వగలం, అవార్డులెలా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో ఆస్కార్ వాళ్లు మనల్ని సలహా తీసుకొనేంత గొప్పగా ఎదగగలం. మన దగ్గర అంత సత్తా ఉంది” అని కమల్ సమాధానం ఇచ్చారు. ఆస్కార్ లాంటి ఓ వేడుక నిర్వహించగలిగే సత్తా భారత్‌కు ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కమల్ చెప్పినట్టు, ఆ స్థాయిలో ఓ వేడుక నిర్వహించి, ప్రపంచ సినిమాల్ని గౌరవించి, ఆస్కార్‌కి సైతం సలహాలు ఇవ్వగలిగే స్థాయికి ఇండియన్ సినిమా చేరుకొంటే మంచిదే. కానీ… అందుకు తొలి అడుగులేసేది ఎవరు? రాష్ట్రాలకు సంబంధించిన అవార్డులే మనం సక్రమంగా ఇవ్వలేకపోతున్నాం. నందిలాంటి అవార్డులు ఉంటాయని చిత్రసీమ మర్చిపోయింది. అలాంటప్పుడు ప్రపంచ సినిమాల్ని గౌరవించే స్థాయిలో ఓ ఈవెంట్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కాకపోతే కమల్ ఆలోచన బాగుంది. ప్రభుత్వాలు, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఓ వేడుక నిర్వహిస్తే గొప్పగానే ఉంటుంది. మరి ఆ దిశగా సినిమా పెద్దలెవరైనా ఆలోచిస్తే బాగుంటుంది.