తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా మారింది జగన్ రెడ్డి పరిస్థితి. ఓటమి నుంచి తేరుకొని మెల్లగా పొలిటికల్ ట్రాక్ ఎక్కబోతున్నామని సంబరపడుతున్న వైసీపీకి త్వరలోనే బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీని వీడెందుకు మాజీ మంత్రులు,కీలక నేతలు రంగం సిద్దం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగానే..తాజాగా కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని, వారంతా వైఎస్సార్ కేబినెట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారేనని హింట్ ఇవ్వడంతో ఆ నేతలు ఎవరన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం..వైసీపీ నుంచి చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం కొంతమంది వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలను సంప్రదించినా చేరికలకు కూటమి పార్టీలు డోర్లు క్లోజ్ చేశాయి. పలు అవినీతి ఆరోపణలు ఉండటంతో కూటమి సర్కార్ తమను ఎలాగైనా టార్గెట్ చేస్తుందని అంచనాతో జాతీయ పార్టీలోకి వెళ్లాలని వైసీపీలోని కీలక నేతలు భావిస్తున్నారు.
ఈ సమయంలో వారికి కాంగ్రెస్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. కేసులైనా , అరెస్టు జరిగినా తమకు జాతీయ స్థాయిలో నుంచి మద్దతు ఉంటుందని అందుకే వైసీపీని వీడెందుకు కొంతమంది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షర్మిల, కేవీపీలకు పలువురు నేతలు టచ్ లో ఉన్నారని, కాకపోతే వైసీపీకి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇలా.. వైసీపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే.. జగన్ మాత్రం ఊహాలోకంలో తేలియాడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ వైసీపీ రీయాక్టివేట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ, మరికొద్ది రోజుల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని పసిగట్టలేకపోతున్నారు పాపం.