28 ఏళ్ల తరవాత శంకర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ తీస్తానని చెప్పడమే ఓ ఆశ్చర్యం. ఇప్పుడు పార్ట్ 2 మాత్రమే కాదని, పార్ట్ 3 కూడా ఉంటుందని మరో షాక్ ఇచ్చాడు. పార్ట్ 3కి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా అయిపోయింది. 2025 జనవరిలో పార్ట్ 3 విడుదల చేస్తానని శంకర్ ప్రకటించాడు. ఒకే సినిమాని ఇలా పార్టు పార్టులుగా విడగొట్టి విడుదల చేయడం వల్ల ఓ సౌలభ్యం ఉంది. ఒకే సినిమాని రెండు సార్లు బిజినెస్ చేసుకోవొచ్చు. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్ల, అదే కథని ఇంకాస్త పొడిగించి, ఇలా సినిమాకు బిజినెస్ పెంచుకోవొచ్చు. శంకర్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొనే, ‘భారతీయుడు 3’ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాని ప్రేమిస్తానని, సినిమాని అమ్ముకోవడానికి ఇలాంటి ట్రిక్కులు ప్లే చేయడం తనకు తెలీదని కొంచెం ఘాటుటానే సమాధానం చెప్పారు.
సినిమా అంతా షూట్ చేసుకొని, మధ్యలో ట్రిమ్ చేసి, ఎడిట్ చేసి, సినిమాని మళ్లీ చూసుకొంటే, తీసిన ప్రతి సన్నివేశం బాగుందనే అనిపించిందని, ఏ సన్నివేశాన్ని తొలగించినా, కథలోని మ్యాజిక్ మిస్సవుతుందని, అందుకే పార్ట్ 3 కూడా ప్లాన్ చేశామని, అంతే తప్ప, ఒకే సినిమాని రెండుసార్లు అమ్ముకోవడం కోసం కాదని చెప్పేశారు శంకర్. దీనిపై కమల్ కూడా బదులు ఇచ్చారు. ”పార్ట్ 3 ఎందుకన్న ప్రశ్న నాకూ వచ్చింది. ఈ కథ మొత్తాన్ని ఒకేసారి చెప్పేయొచ్చు కదా, అని శంకర్ని అడిగా. ఆయన నాకు సంతృప్తికరమైన జవాబు ఇచ్చారు” అన్నారు కమల్. పార్ట్ 2లో కమల్ హాసన్ పాత్ర చాలా చిన్నదని, ఆయన గెస్ట్ గానే కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా శంకర్ సమాధానం ఇచ్చారు. ”ఇది కమల్ సినిమా. తెరపై ఆయన కనిపించినా, కనిపించకపోయినా ఆయన ఇంపాక్ట్ ప్రతీ సీన్లోనూ ఉంటుంది” అన్నారు. ”నా స్క్రీన్ స్పేస్ ఎంత? అని ఎప్పుడూ ఆలోచించలేదు. నేను సినిమాని సినిమాగా చూస్తా. ఇందులో నాకో డ్యూయెట్ ఎందుకు పెట్టలేదు అని శంకర్ని అడగలేను. సినిమాకు ఏం అవసరమో, ఏది వద్దో ఆయనకు బాగా తెలుసు” అన్నారు కమల్.