తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవులు పంపకం మొదలుపెట్టింది. నామినేటెడ్ పోస్టుల్లో తమ పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులకు వివిధ కార్పోరేషన్ పదవులన పంచిపెట్టింది. నిజానికి ఈ పదవుల పంపకం లోక్ సభ ఎన్నికల ముందే జరిగినా… కోడ్ రావటంతో జీవోలు రాలేదు.
ఇప్పుడు అలా సీఎంవో నుండి జీవో వచ్చినట్లు సమాచారం వచ్చిందో లేదో… నాయకులంతా హడావిడిగా విధుల్లో చేరిపోయారు. సాధారణంగా కార్పోరేషన్ చైర్మన్లుగా ఎంపిక అయిన వారు బాధ్యతలు తీసుకున్న సమయంలో ఆ శాఖ మంత్రి, వారి జిల్లాకు సంబంధించిన పార్టీ ముఖ్యులు, ఇతర కీలక నేతలు హజరవుతుంటారు. కానీ, కాంగ్రెస్ నాయకుల బాధ్యతలు తీసుకునే సమయంలో అలాంటిదేమీ కనపడ లేదు.
ఇంత హడావిడిగా ఎందుకు బాధ్యతలు తీసుకున్నారు అని ఆరా తీయగా… కేసుల భయమే కారణం అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని.. కోర్టు స్టే ఇస్తే కథ మళ్లీ మొదటికి వస్తుందన్న ఉద్దేశంతోనే మెజారిటీ నేతలు బాధ్యతలు తీసుకున్నారట. ఇప్పటికే ఆషాడం వచ్చింది. సోమవారం దాటితే మంగళవారం ప్రమాణస్వీకారం తీసుకోలేరు… అందుకే తప్పక చేరిపోయారట. అంతేకాదు, సొంత పార్టీలోనే గతంలో పదవుల ప్రకటన రాగానే కొంత అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటిది రాకుండా జాగ్రత్త పడ్డట్లు కనపడుతోంది.
మొత్తంగా… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకులకు పదవుల పంపకం మొదలైంది. త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని సమాచారం.