వైఎస్ జయంతి కోసం ఏపీకి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అంటే బాబు, పవన్, జగన్ అని తేల్చేశారు. దీనికి టీడీపీ సోషల్ మీడియాలో కొంత మంది తెగ ఫీలవుతున్నారు. ఆయనను సపోర్ట్ చేశామని ఇప్పుడు అలా విమర్శిస్తున్నారని అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డిని సపోర్టు చేయమని వారిని ఎవరూ అడగలేదు. వారి అభిమానం వారు చూపించారు. కానీ తాము సపోర్టు చేశాం కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ పని మీద ఏపీకి వచ్చి చంద్రబాబును, టీడీపీని పొగడాలంటే ఎలా సాధ్యం ?
ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖలో కాంగ్రెస్ తరపున ఓ సభ నిర్వహించారు. ఆ సభలోనూ రేవంత్ రెడ్డి అదే మాట చెప్పారు. అది ఆయన రాజకీయ విధానం. రేవంత్ రెడ్డి చంద్రబాబును విమర్శించకపోవడానికి ఆయన బయటకు చెప్పే కారణాలు నిజమో కాదో ఎవరికీ తెలియదు కానీ రాజకీయ కారణాలు మాత్రం నిజం. తెలంగాణలో టీడీపీ సానుభూతిపరుల్ని తన వైపు ఉంచుకోవడానికే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అందుకే కాంగ్రెస్ పై వ్యతిరేకత ఉన్న టీడీపీ ఫ్యాన్స్ కూడా రేవంత్ ను సమర్థిస్తారు. టీడీపీ బలంగా … ముందుకు రానంత కాలం వారిని తన వైపు ఉంచుకునేలా రేవంత్ వ్యూహం అది.
ఏపీలో దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఆయన కాంగ్రెస్ నేతగానే వ్యవహరిస్తారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్న దాంట్లో అసలు విమర్శే లేదనుకోవచ్చు. అధికారికంగానే బాబు, పవన్ పొత్తులో ఉన్నారు. జగన్ మాత్రమే ఏ మాత్రం వెరపు లేకుండా బీజేపీతో అంటకాగుతున్నారు. ఓ రకంగా ఇది జగన్ ను విమర్శించినదే. అయినా కొంత మంది టీడీపీ ఫ్యాన్స్ మాత్రం గింజుకుంటున్నారు. రేవంత్ తన పార్టీ కోసమే మాట్లాడతారు తప్ప… మరో పార్టీ కోసం మాట్లాడతారని అనుకోవడం రాజకీయ అమాయకత్వమే.