తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ చాలా వేగంగా పెరిగింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న చోట ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాల నుండి 8కి ఎగబాకింది. ఇంత మంచి హైప్ ఉన్న సమయంలో… బీఆర్ఎస్ సున్నా సీట్లతో చతికిల పడ్డ సమయంలో బీజేపీ సైలెన్స్ మోడ్ ఇప్పుడు క్యాడర్ ను కూడా ఆలోచనలో పడేస్తుంది.
బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించటం యాక్టివ్ క్యాడర్ కు, నేతలకు ఇష్టం లేదు. కిషన్ రెడ్డి సాఫ్ట్ అనేది అందరికీ తెలుసు. ఎన్నికలయ్యాక, కిషన్ రెడ్డికి మంచి ప్రియారిటీ ఉన్న మినిస్ట్రీ వచ్చాక ఆయన తెలంగాణ బీజేపీని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఢిల్లీలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. పైగా బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం పార్టీ పదవి, ప్రభుత్వ పదవిలో ఒకరే ఉండకూడదు. సో… అధ్యక్ష పదవికి కొత్త వారు వస్తారు. కేంద్ర క్యాబినెట్ ఏర్పాటు సమయంలోనే అధ్యక్ష పదవి కూడా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. ఎంపీ ఈటలకు పదవి రాబోతుందన్న చర్చ కూడా జరిగింది.
కానీ, కేంద్రంలోనూ నడ్డా ప్రభుత్వంలో చేరిపోయారు కాబట్టి కొత్త జాతీయ అధ్యక్షుడు రావాల్సిందే. అప్పుడే రాష్ట్రానికి కూడా కొత్త బాస్ ప్రకటన ఉండబోతుంది.
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై పోరాడేందుకు బీజేపీ నేతలు ఎవరూ ముందుకు రావట్లేదు. ఎల్పీ లీడర్, అధ్యక్షుడు, ఎంపీలు అంతా సైలెంట్ గానే ఉండిపోయారు. ఏబీవీపీ ఉన్నంత యాక్టివ్ గా కూడా మా పార్టీ లేదు… యాక్టివ్ గా జనం సమస్యలపై పోరాటం మిస్ అవుతుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది.
కొత్త అధ్యక్షుడొచ్చే వరకు ఇది తప్పదని… ఈటలకు ఇస్తారా మరో నేతకు అవకాశం ఇస్తారా తర్వాత సంగతి… బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో బీజేపీ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని క్యాడర్ కోరుకుంటుంది. అప్పుడే బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికలుంటాయని, ఈ క్రైసిస్ సమయమే బీజేపీ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తోంది.